కొలంబో: వెస్టిండీస్ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్ ట్రైనింగ్ క్యాంప్‌లో కలకలం రేగింది. ఆ జట్టు పరిమిత ఓవర్ల ఆటగాళ్లు బినురా ఫెర్నాండో, చమికా కరుణరత్నేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో విండీస్ టూర్‌కు ఎంపికైన జట్టులో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ పర్యటనలో శ్రీలంక, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక తమ ఆటగాళ్లకు కరోనా సొకిందనే విషయాన్ని లంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఆ ఇద్దర్ని క్వారంటైన్‌కు తలరించినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
'జనవరి 20న జరిపిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటీవ్ అని తేలింది. శ్రీలంక ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ నిబంధనల ప్రకారం వారిద్దర్ని క్వారంటైన్‌కు తరలించాం. జనవరి 18న ఎస్ఎస్సీ గ్రౌండ్స్‌లో ఈ బృందం శిక్షణ ప్రారంభించింది. ఈ నెల 20న చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఫెర్నాండో, చమికాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన ఆటగాళ్లకు జనవరి 26న మరోసారి కరోనా టెస్ట్‌లు చేస్తాం'అని లంక బోర్డు పేర్కొంది. పేసర్ ఫెర్నాండో 2015లో చివరిసారిగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించగా.. 2019లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో కరుణరత్నే ఆడాడు. శ్రీలంక క్రికెట్లో కోవిడ్ కేసులు బయటపడడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం శ్రీలంక జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుండగా.. మరోవైపు విండీస్ టూర్‌కు ఎంపికైన ఆటగాళ్లు ట్రైనింగ్ క్యాంప్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.