హైదరాబాద్: 2017 శ్రీలంక జట్టు ఏ మాత్రం కలిసి రాలేదు. వరుస సిరిస్ ఓటములతో ఆట ఆటగాళ్లతో పాటు ఇటు బోర్డు సైతం సంక్షోభంలో పడింది. తాజాగా భారత్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను 3-0తో కోల్పోగా, ఐదు వన్డేల సిరిస్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 5-0తో వైట్ వాష్‌కు గురైంది.
ఈ క్రమంలో శ్రీలంక జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆ చెత్త రికార్డు ఏంటంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 70శాతం క్యాచ్‌లను వదిలిపెట్టి తద్వారా మ్యాచ్‌లను చేజార్చుకున్న జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచింది.
లంక వరుస ఓటములకు క్యాచ్‌లను పట్టక పోవడాన్ని కూడా ఓ కారణంగా చూపిస్తున్నారు. 2017లో టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు విభాగాల్లో కలిపి శ్రీలంకకు చెందిన 26 మంది ఆటగాళ్లు 65 క్యాచ్‌లను వదిలేశారు. దీంతో భారీ మూల్యాలనే చెల్లించుకున్నారు.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లీగ్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ బౌలింగ్‌లో పెరారా, ప్రసన్నలు 3 క్యాచ్‌లను వదిలేశారు. ఎంతో కీలకమైన ఈ మూడు క్యాచ్‌లను వదిలివేయడంతో శ్రీలంక ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది.
ఇక భారత్-శ్రీలంక మధ్య గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇచ్చిన క్యాచ్‌ని గుణరత్నే చేజార్చిన విషయం తెలిసిందే. దీంతో శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. అత్యధిక క్యాచ్‌లను చేజార్చిన ఆటగాళ్ల జాబితాలో దినేశ్ చండీమాల్, ఉపుల్ తరంగ, మునవీర, డిక్‌వెల్లా, గుణరత్నే, మలింగ, గుణతిలక ఉన్నారు.
శ్రీలంక జట్టులో అత్యధికంగా క్యాచ్‌లను వదిలేసిన ఆటగాళ్లు:
దినేశ్ చండీమాల్: 5
ఉపుల్ తరంగ: 5
మునవీర: 4
డిక్‌వెల్లా: 4
గుణరత్నే: 4
లసిత్ మలింగ: 4
ధనుష్క గుణతిలక: 4