
హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా వన్డేల్లో బదులు తీర్చుకుంది. ఇంకా రెండు వన్డేలు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. రీజా హెండ్రిక్స్ (102) అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో రాణించడంతో లంకతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆదివారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. డుమిని (92), ఆమ్లా (59), మిల్లర్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. డుమినితో కలిసి హెండ్రిక్స్‌తో నాలుగో వికెట్‌కు 78 పరుగులు, మిల్లర్ (51)తో కలిసి ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు.
శ్రీలంక బౌలర్లలో తిసారా పెరీరా నాలుగు వికెట్లు తీయగా, లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ధనంజయ డిసిల్వా (84) హాఫ్ సెంచరీతో రాణించగా, కెప్టెన్ మాథ్యూస్ (32), ధనంజయ (37) ఫరవాలేదనిపించారు.
సఫారీ బౌలర్లలో లంగి ఎంగడి (4/53) లంక పతనాన్ని శాసించాడు. ధాటిగా ఆడే క్రమంలో 155 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో దనంజయ డిసిల్వా (84) ఏడో వికెట్‌కు స్పిన్నర్ దనంజయతో కలిసి 95 పరుగులు జత చేశాడు. మరో సఫారీ బౌలర్ ఫెలుక్వాయోకు 3 వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే ఆగస్టు 8న క్యాండీలో జరుగనుంది.