
హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరిస్‌లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేస్తోంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (87) హాఫ్ సెంచరీతో రాణించడంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 244 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (79 నాటౌట్; 6 ఫోర్లు), డిక్‌వెలా (69; 10 ఫోర్లు) అలరించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి (3/50), పెహ్లుక్‌వాయో (3/45) సత్తా చాటారు.
అనంతరం 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి మరో 43 బంతులు మిగిలుండగానే ఛేదించింది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో డికాక్ (78 బంతుల్లో 87; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆమ్లా (43; 6 ఫోర్లు), కెప్టెన్ డు ప్లెసిస్ (49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా దనంజయ మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 78 బంతుల్లో 87 పరుగులు నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన డీకాక్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో దక్షిణాఫ్రికా 2-0తో ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం జరుగనుంది.