
కొలంబో: త్వరలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్వల్ప సమయ మార్పులు చేసినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే వన్డేలను అరగంట, 25 నుంచి ప్రారంభమయ్యే టీ20లను గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఎల్‌సీ తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను ట్విటర్ వేదికగా ఎస్‌ఎల్‌సీ అభిమానులతో పంచుకుంది. ఆతిథ్య జట్టు శ్రీలంకలో కరోనా కేసులు కలకలం రేపడంతో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఇటీవల రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మ్యాచ్ నిర్వహణ తేదీల్లోనూ మార్పులు చేశారు.
ఇటీవల ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశం చేరుకున్న శ్రీలంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బంది (బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు.. 18కి వాయిదా పడ్డాయి. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎల్‌సీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3, రాత్రి 8 గంటలకు మ్యాచులు స్టార్ అవ్వనున్నాయి.
శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు జూన్ నెల చివర్లోనే కొలంబోకి చేరుకుని.. క్వారంటైన్ అయ్యారు. ఆ తర్వాత కొలంబో మైదానంలో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. అయితే లంక టీమ్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మళ్లీ భారత క్రికెటర్లని క్వారంటైన్‌లో ఉండమని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశించింది. శనివారం నుంచి ధావన్ సేన హోటెల్లోనే క్వారంటైన్ అయింది. లంక బోర్డు నుంచి తదుపరి ఆదేశాల వరకూ భారత ఆటగాళ్లు హోటల్ రూములకే పరిమితం కానున్నారు.
శ్రీలంక బృందంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఆటగాళ్లందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్‌తో సిరీస్ నిమిత్తం వీరంతా ఈరోజు బయోబుడగలోకి వెళ్లారు. అయితే టీమిండియాతో అదే జట్టుని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటిచాల్సి ఉంది.