
ముంబై: భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కరోనా వైరస్ మహమ్మారి సెగ తగిలిన విషయం తెలిసిందే. శ్రీలంక జట్టులో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొలంబోలో జూలై 13న జరగాల్సిన తొలి వన్డే.. 18న జరగనుంది. వన్డే, టీ20 సిరీస్ మ్యాచులు జూలై 18 నుంచి 29 వరకు జరగనున్నాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం ధృవీకరించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.
మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక, భారత్ మధ్య జూలై 18 మొదటి వన్డే జరగనుంది. 20న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా జూలై 25న తొలి టీ20, 27న రెండో టీ20, 29న మూడో టీ20 మ్యాచులు జరుగుతాయి. ముందస్తు షెడ్యూల్ కంటే రెండు రోజుల ఆలస్యంగా భారత పర్యటన ముగియనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ ఇదివరకు షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ముగించుకుంది. సిరీస్ ముగిసిన రెండు రోజులకే ఇంగ్లండ్ జట్టులో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొలంబోకి వచ్చే ముందే శ్రీలంక టీమ్‌కి కరోనా పరీక్షలు చేయించారు. అప్పుడు ఎవరికీ పాజిటివ్ రాలేదు. శ్రీలంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకున్నారు. కొలంబోలో అడుగుపెట్టిన శ్రీలంక టీమ్‌కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కి పాజిటివ్‌గా తేలింది. దాంతో అతడ్ని వెంటనే ఐసోలేషన్‌కి పంపిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌కి తరలించింది. తాజాగా మరోసారి నిర్వహించిన టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్లందరికి నెగటివ్ వచ్చినా.. డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కి పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది.
కరోనా కేసుల కారణంగా శ్రీలంక టీమ్ క్వారంటైన్ గడువును లంక బోర్డు పొడిగించింది. అలానే వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేశారు. మరోవైపు లంక జట్టులో మరింత మందికి వైరస్ సోకితే ఏం చేయాలన్న దానిపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) దృష్టిపెట్టింది. ఇంగ్లండ్ తరహాలో ప్రత్యామ్నాయ జట్టును టీమిండియాతో సిరీసులో బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం తెలిసింది.