For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్టు, డే1: భారత్ 344/3, సెంచరీలు చేసిన పుజారా, రహానే

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ సేన లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 52, పుజారా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 128, రహానే 103 పరుగులతో ఉన్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 211 పరుగులు జోడించారు.

133 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో ఈ ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 35 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్‌ 35 పరుగుల వద్ద తొలి వికెట్‌గా కోల్పోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 52 పరుగుల వద్ద రనౌట్ కాగా, కోహ్లీ 13 ప‌రుగులు చేసి అవుటయ్యాడు.

రహానే సెంచరీ
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అజ్యింకె రహానే సెంచరీ చేశాడు. టెస్టుల్లో రహానేకు ఇది 9వ సెంచరీ కావడం విశేషం. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. 151 బంతుల్లో 12 ఫోర్లతో రహానే సెంచరీ చేశాడు. ఇదే మ్యాచ్లో పుజారా కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. పుజారా-రహానే నాలుగో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

పుజారా సెంచరీ
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పుజారా సెంచరీ చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 13వ సెంచ‌రీ కాగా ఈ సిరీస్‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ. 163 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో పుజారా సెంచ‌రీ చేశాడు.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా పుజారా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో 50వ టెస్ట్ ఆడుతున్న పుజారా ఈ మ్యాచ్‌లోనే 4 వేల ప‌రుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

Pujara

ఈ మ్యాచ్‌కు ముందు 49 టెస్టుల్లో 3966 పరుగులతో ఉన్నాడు. టెస్టుల్లో పుజారా అత్య‌ధిక స్కోరు 206. మొత్తం 13 సెంచ‌రీలు, 15 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. ఏడాది కాలంగా పుజారా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇక ర‌హానే కూడా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకోవ‌డంతో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా సాగుతున్న‌ది. ర‌హానేకు టెస్టుల్లో ఇది 13వ హాఫ్ సెంచ‌రీ. పుజారా, ర‌హానే ఇప్ప‌టికే నాలుగో వికెట్‌కు వంద‌కు పైగా భాగస్వామ్యాన్ని న‌మోదు చేశారు. 70 ఓవర్లకు గాను భారత్ 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 106, రహానే 62 పరుగులతో ఉన్నారు.

13 పరుగుల వద్ద కోహ్లీ అవుట్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి సెషన్‌లో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయిన భారత్‌ రెండో సెషన్‌లో కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ వికెట్లను కోల్పోయింది. రాహుల్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 13 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. 39వ ఓవర్లో హెరాత్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. మాథ్యూస్‌కి క్యాచ్‌ ఇచ్చాడు.

కోహ్లీ ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 3 పరుగులకే అవుటవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక 43 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(41), రహానె(6) ఉన్నారు.

50వ టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన పుజారా
50వ టెస్టు ఆడుతోన్న పుజారా హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పుజారా 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్‌ తరఫున 50 టెస్టుల్లో 4వేలకు పైగా పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. 41.2వ ఓవర్లో దిల్రువన్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న పుజారా రెండు పరుగులు తీయడంతో టెస్టుల్లో 4వేల పరుగులను పూర్తి చేశాడు.

కేఎల్ రాహుల్‌ రనౌట్‌
లంచ్‌ విరామం తర్వాత ఆట ప్రారంభించిన భారత్‌ స్వల్ప వ్యవధిలోనే వికెట్‌ కోల్పోయింది. 31వ ఓవర్లో హెరాత్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ పరుగు తీసేందుకు యత్నించాడు. పుజారా వద్దని సైగ చేయడంతో వెనక్కి పరిగెత్తాడు. అదే సమయంలో చండీమాల్ నుంచి బంతి అందుకున్న డిక్వెల్లా మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. దీంతో 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్‌కు చేరాడు. రాహుల్ అవుటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. 34 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(23), కోహ్లీ(3) ఉన్నారు.

లంచ్ విరామానికి టీమిండియా 101/1

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ సేన లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 52, పుజారా 14 పరుగులతో ఉన్నారు. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ టీమ్‌లోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్ టెస్టుల్లో వ‌రుస‌గా ఆరో అర్ధ సెంచ‌రీ చేశాడు.

ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ధాటిగా ఆడి 35 ప‌రుగులు చేసి అవుటయ్యాడు. 11వ ఓవర్లో దిల్రువన్‌ పెరీరా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్‌(35) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌‌కు చేరాడు. ధావ‌న్ ఇన్నింగ్స్‌లో అయిదు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ధావన్‌-పుజారా జోడీ తొలి వికెట్‌కు 56 ప‌రుగులు జోడించారు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన పుజారా నెమ్మ‌దిగా ఆడుతున్నాడు. అంతకముందు 9.1వ ఓవర్లో రాహుల్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కరుణరత్నే వేసిన తొలి బంతిని రాహుల్‌ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బౌలర్‌ అవుట్‌గా అప్పీల్‌ చేయడంతో మైదానంలో ఉన్న అంపైర్‌ అవుటిచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ రివ్యూ కోరాడు. రివ్యూలో రాహుల్‌ నాటౌట్‌గా అని తేలింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌‌లో జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ చాలా బాగుందని చెప్పాడు. బ్యాటింగ్ సహకరించే పరిస్థితులు ఉన్నాయని... ఈ పరిస్థితిని తాము సద్వినియోగం చేసుకుంటామని తెలిపాడు. తొలి టెస్టులో ధావన్ అద్భుతంగా ఆడి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడని... అభినవ్ ముకుంద్ బాగా ఆడినప్పటికీ, రాహుల్ కోసం అతను తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

శ్రీలంక కెప్టెన్ చండిమల్ మాట్లాడుతూ, గత పది రోజుల నుంచి కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పాడు. భారత్ అద్భుతంగా రాణిస్తోందని కితాబిచ్చాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ధావన్ లాగ భారీ ఇన్నింగ్స్ ఆడితే, జట్టుకు లాభిస్తుందని అభిప్రాయపడ్డాడు. జట్టులో మూడు మార్పులు చేశామని ధనుష్క, కుమార, అసేలలు గాయాల కారణంగా తుది జట్టుకు దూరమయ్యారని తాను, మలింద, ధనంజయలు జట్టులోకి వచ్చామని తెలిపాడు.

గాలే టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్టు ద్వారా సిరిస్ విజయంపై దృష్టి పెట్టింది. అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా... భారత జట్టులోకి రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ వచ్చాడు. అభినవ్‌ ముకుంద్‌ స్థానంలో రాహుల్‌ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌తో భారత్‌ తరఫున కనీసం 50 టెస్టులు ఆడిన 31వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. పుజారాకిది 50వ టెస్టు కావడం విశేషం. పుజారా కెరీర్లో ఇప్పటి వరకు 49 టెస్టుల్లో 51.18 సగటుతో 3966 పరుగులు చేశాడు. 2015లో భారత్‌ లంకలో పర్యటించినప్పుడు ఈ మ్యాచ్‌ జరుగుతోన్న మైదానంలోనే పుజారా 145 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.

కేఎల్ రాహుల్‌ తుది జట్టులోకి రావడంతో కెప్టెన్‌గా తుది జట్టు విషయంలో కోహ్లీ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నాడు. తద్వారా వరుసగా 27 టెస్టుల్లో కనీసం ఒక్క ఆటగాడినైనా మార్చిన కోహ్లీ 28వ టెస్టులోనూ దానిని కొనసాగించాడు.

జట్ల వివరాలు:

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా, ఉమేశ్, షమీ.

శ్రీలంక: చండిమాల్‌ (కెప్టెన్‌), తరంగ, కరుణరత్నే, కుషాల్‌ మెండిస్, మాథ్యూస్, డిక్‌వెలా, ధనంజయ, పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్‌.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+