హైదరాబాద్: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజైన శనివారం ఓ తాగుబోతు అభిమాని హల్‌చల్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్‌కి సమీపంలోని స్టాండ్స్ వద్దకు చేరిన ఆ అభిమాని గట్టిస్తూ అరుస్తూ బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్‌కి మద్దతు తెలిపాడు. అప్పటికే మెండిస్ క్రీజులో కుదురుకున్నప్పటికీ పరుగులు చేసేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

ఈ సమయంలో మెండిస్ 'డిఫెన్స్ ఆడు, ఏకాగ్రత కోల్పోవద్దు. రేపటి వరకు వికెట్ కాపాడుకో. అవును.. నువ్వు సాధించగలవు' అంటూ అభిమాని తరచూ బిగ్గరగా అరుస్తూ సూచనలు ఇచ్చాడు. అయితే దీనిని గమనించిన ఫీల్డ్ అంపైర్ రోడ్ టక్కర్ మ్యాచ్ అధికారులకి ఫిర్యాదు చేశాడు.
అభిమాని సూచనలతో తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు మధ్యలో సైలెంట్‌గా ఉండాలని తాను సూచించినప్పటికీ అతడు పట్టించుకోలేదని టక్కర్ పేర్కొన్నాడు. దీంతో మ్యాచ్ అధికారులు రంగంలోకి దిగి ఎస్పీ జయన్ అనే అభిమానిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో అతడు మద్యం సేవించినట్లు గుర్తించిన మ్యాచ్ అధికారులు అతడిని స్టాండ్స్ నుంచి బయటకు పంపించేశారు.