
గాలె: ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 38 ఏళ్ల అండర్సన్ (6/40) 6 వికెట్లతో చెలరేగాడు.టెస్టుల్లో జిమ్మీ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 30వసారి. నిరోషన్ డిక్వెల్లా (92), సురంగ లక్మల్ (0), ఏంజెలో మాథ్యూస్ (110), కుశాల్ పెరీరా (6), లాహిరు తిరిమన్నే (43) లను అండర్సన్ అవుట్ చేశాడు.
ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (29 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన) రికార్డును జేమ్స్ ఆండర్సన్ అధిగమించాడు. టెస్టు క్రికెట్లో ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 67 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయగా.. ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (37), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ రిచర్డ్ హడ్లీ (36), భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే (35), లంక మాజీ స్పిన్నర్ రంగన హెరాత్ (34) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక ఆసియాలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. 2012 మార్చి 26న లంకతో జరిగిన టెస్టులోనే అండర్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఆసియాలో 5 వికెట్లు తీసిన రెండవ పెద్ద వయస్కుడు కూడా అతడే. శ్రీలంక మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ ( 40 ఏళ్లు, 123 రోజులు) ముందున్నాడు. అండర్సన్ 38 సంవత్సరాల 177 రోజులలో 30వసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
600లకు పైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మాత్రమే. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 157 మ్యాచులలో 606 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన జాబితాలో జిమ్మీ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు. మరో 14 వికెట్లు పడగొడితే.. అనిల్ కుంబ్లేను దాటి మూడవ స్థానానికి చేరుకుంటాడు. గాలె టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లంక 381 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 98 రన్స్ చేసింది.