
హైదరాబాద్: నిదాహస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఓవర్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అసలేం జరిగింది?
బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. కానీ చివరి ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు.
అయితే.. వాటిని క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్ బ్యాట్‌తో తాకించలేకపోయాడు. ఈ క్రమంలో రెండో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో మహ్మదుల్లాకి డ్రింక్స్ తీసుకొచ్చిన సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్ నూరుల్.. శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరాతో గొడవపడ్డాడు.
బంతి బ్యాట్స్‌మెన్ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు.
అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు.
అయితే అప్పటికే జోరుమీదున్న మొహమ్మదుల్లా స్ట్రయింగ్ ప్లేస్‌కు వచ్చేశాడు. ఉడానా వేసిన మూడో బంతికి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ తరలించాడు. ఆ తర్వాత నాలుగవ బంతికి రెండు రన్స్ తీశాడు. మిగిలి ఉన్న రెండు బంతుల్లో ఆరు రన్స్ చేయాలి. అయితే మొహమ్మదుల్లా ఐదవ బంతిని కొట్టిన తీరు లంక ప్లేయర్లను షాక్‌కు గురిచేసింది.
లెగ్‌సైడ్ ప్యాడ్స్‌పై వేసిన బంతిని .. ఆన్‌సైడ్‌లో సిక్సర్ కొట్టాడు. ఇలా మహ్మదుల్లా వరుసగా 4, 2, 6 బాది ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. దీంతో బంగ్లా టైగర్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. ఇది ఏమాత్రం నచ్చిన శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు కొందరు బంగ్లా ప్లేయర్లతో గొవడకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.