కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్..విరిగి పడిన కెరటం. 90వ దశకంలోనే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న జట్టు. ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. 2011 వరకు అత్యుత్తమ జట్టుగా గుర్తింపు పొందింది. కుమార సంగక్కార, మహేల జయవర్ధనె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత.. శ్రీలంక జట్టు ప్రాభవం తగ్గింది. ఓ సాధారణ జట్టు స్థాయికి పడిపోయింది. విజయాల కోసం ముఖం వాచి పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి శ్రమిస్తోంది లంక జట్టు. ఆ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. పతనానికి చెక్ పెట్టింది. మేటి జట్టు ఆస్ట్రేలియాపై వరుస విజయాలను అందుకుంది. ఇంకో గెలుపును నమోదు చేస్తే- సుదీర్ఘ విరామం తరువాత వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌ను సొంతం చేసుకున్నట్టవుతుంది లంకేయులకు. ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయిన తరువాత బౌన్స్ బ్యాంక్ అయింది.
అయిదు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో ముందంజలో ఉంది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై ఆధిక్యతను సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఇవ్వాళ నాలుగో వన్డే జరుగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఆధిక్యతను సాధించినందున ఇంకో మ్యాచ్‌ను గనక శ్రీలంక గెలుచుకుంటే ఆస్ట్రేలియాలపై వన్డే సిరీస్‌ను నెగ్గిన ఘనతను అందుకుంటుంది. ఈ గెలుపు ఇచ్చిన ఊపు శ్రీలంకకు బూస్ట్ ఇస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
తొలి వన్డేలో ఓడిన లంక జట్టు అద్భుతంగా పుంజుకొంది. రెండు, మూడు వన్డేల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. మూడో వన్డేలో 292 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు 48.3 ఓవర్లల్లోనే కొట్టి పడేశారు. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక, వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో చెలరేగారు. నిశ్శంక..147 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఇవ్వాళ కూడా అదే దూకుడును కొనసాగిస్తే- సిరీస్ సొంతం చేసుకోవడం ఖాయం.
శ్రీలంక తుదిజట్టులో- నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డాసన్ శనక (కేప్టెన్), చమిక కరుణరత్నె, జెఫ్రీ వాండెర్సె, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగె ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కేప్టెన్), మిఛెల్ మార్ష్, మార్నుస్ లాంబుషెన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, జైరె రిచర్డ్సన్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ హేజిల్‌వుడ్ ఆడొచ్చు.