హైదరాబాద్: భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో ఘోర ఓటమిని పాలవ్వడాన్ని శ్రీలంక క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు వైట్ వాష్‌కు గురవడంపై శ్రీలంక క్రీడాశాఖ.. ఆ దేశ క్రికెట్ బోర్డును నివేదిక కోరింది.
జట్టు ఘోర ఓటమిపై నివేదిక సమర్పించాలని ఆ దేశ క్రీడా మంత్రి దయసిరి జయశేఖర బోర్డును ఆదేశించారు. ప్రస్తుత జట్టు సామర్థ్యంపై తనకెలాంటి సందేహాలు లేవని, క్లీన్‌స్వీప్ కావడానికి గల కారణాలను మాత్రమే తెలుసుకోవాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

అంతకానీ జట్టు సామర్థ్యాన్ని కించపరిచేలా వ్యవహరించడంలేదని మంత్రి దయసిరి జయశేఖర బుధవారం మీడియాకు తెలిపారు. క్లీన్ స్వీప్‌పై ఇప్పటికే రెండు గంటలు సమావేశంలో చర్చించామని ఆయన అన్నారు. టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అన్న సంగతిని మరిచిపోరాదని అన్నారు.
'జట్టు సామర్థ్యంపై మేం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయడం లేదు. 0-3 తేడాతో ఓడిపోవడానికి గల కారణాలను మాత్రం మేం తప్పనిసరిగా తెలుసుకోవాలి కోరుకుంటున్నాం. అందుకే ఈ విషయంలో సవివరమైన నివేదిక సమర్పించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)ని ఆదేశించాను. భారత్ ప్రపంచ నంబర్‌వన్ జట్టు అని కూడా తెలుసు' అని అన్నారు.
తాజా ఓటమితో లంక అభిమానులు శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలని కోరుతున్నారు. మరోవైపు చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్యపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై కూడా మంత్రి స్పందించారు. ఎన్నికల ద్వారా ఎన్నికైన వారిని తొలగించడం సాధ్యంకాదని కొత్తగా ఎన్నికలు నిర్వహించేత వరకు ఆగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.