
హైదరాబాద్: లంక జట్టుకు కష్టాలు క్యూ కట్టాయి. కొద్ది రోజుల ముందే ఆ జట్టు కెప్టెన్ ఛండీమల్ ట్యాంపరింగ్ ఆరోపణలు కారణంగా జట్టుకు దూరమైయ్యాడు. ఇటీవల జరుగుతోన్న వెస్టిండీస్-శ్రీలంక మధ్య జరుగుతోన్న చివరి టెస్టుకు పాత కెప్టెన్ లేకుండా జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలోనే లంక జట్టు మరో ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అది ట్యాంపరింగ్ ఆరోపణల కారణంగా కాదు.
వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-వెస్టిండీస్ మధ్య చివరి టెస్టు జరుగుతోంది. ఆటలో భాగంగా మూడో రోజైన సోమవారం లంక ఆటగాడు కుశాల్ పెరీరా గాయపడ్డాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఇది జరిగింది. దిల్రువన్ పెరీరా వేసిన బంతిని గాబ్రియల్ ఎదుర్కొన్నాడు. ఆ బంతి బౌండరీ లైన్ దాటి సిక్స్ వెళ్తుండగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కుశాల్ ఆ బంతిని అందుకోబోయాడు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రకటనల బోర్డును బలంగా తాకి బోర్లా పడ్డాడు. హఠాత్పరిణామానికి కొద్దిసేపటి వరకు పక్కకు తిరగలేకపోయాడు. వెంటనే జట్టు సిబ్బంది, ఆటగాళ్లు అక్కడికి చేరారు. ఆస్పత్రికి తరలించాలని కోరడంతో అంబులెన్స్‌ను పిలిపించారు. కుశాల్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా లంక క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
'ఆస్పత్రి నుంచి కుశాల్ డిశ్చార్జి అయ్యాడు. స్కానింగ్‌లు తీయించాం. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. నాలుగో రోజు ఆటలో అతడు తప్పనిసరిగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటేనే చేస్తాడు' అని తెలిపింది. మూడు రోజు ఆట ముగిసే సమయానికి లంక తన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (25), దిల్రువన్ పెరీరా(1) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే లంక ఇంకా 63 పరుగులు చేయాలి.