
హైదరాబాద్: సొంతగడ్డపై సఫారీలకు లంక క్రికెటర్లు ముచ్చెమటలు పట్టించారు. టెస్టు సిరీస్‌లలో మొదటి సిరీస్‌లో వచ్చిన ఫలితాన్ని రెండో సిరీస్‌లోనూ పునరావృతం చేసింది లంక. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 278 పరుగుల తేడాతో గెలుపొందిన లంకేయులు.. రెండో టెస్టులోనూ అదే స్థాయిలో 199 రన్స్ తేడాతో విజయం సాధించారు. ఈ సిరీస్‌లో లంక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా విఫలమయ్యారు.
కొలంబో టెస్టులో ఐదు వికెట్ల నష్టానికి 139 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాను తెంబా బవుమా (98 బంతుల్లో 63), థెయునిస్ డి బ్రుయిన్ (232 బంతుల్లో 101) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. కానీ బవుమా అవుటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న బ్రుయిన్ రంగన హెరాత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో బౌలర్లు డేల్ స్టెయిన్, రబాడ కూడా త్వరగా పెవిలియన్ చేరారు.
దీంతో సఫారీలు 290 పరుగులకు ఆలౌటయ్యారు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 98 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా.. దిల్‌రువాన్ పెరీరా, అకిల ధనంజయ చెరో రెండో వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో లంక పేసర్లు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశారు. ఆ రెండు ఓవర్లు కూడా కెప్టెన్ లక్మల్ వేయడం విశేషం. ఒక్క పరుగు కూడా చేయకుండా, ఒక్క వికెట్ కూడా తీయకుండా టెస్టు మ్యాచ్‌లో గెలుపొందిన 12వ కెప్టెన్‌గా లక్మల్ రికార్డ్ నెలకొల్పాడు.
రేప్ వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన లంక క్రికెటర్:
గుణతిలక స్నేహితుడు హోటల్ గదిలో తనను (నార్వే మహిళను) రేప్ చేశాడంటూ ఆరోపణలు చేయడంతో.. లంక క్రికెట్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత మహిళ.. నిందితునితో పాటు గుణతిలక కూడా రేప్ జరిగిన సమయంలో అదే హోటల్ గదిలోనే ఉన్నాడని ఆమె ఆరోపించింది. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అర్ధరాత్రిలోగా హోటల్ రూమ్‌కి చేరుకోవాలి, అతిథులెవరితోనూ గడపొద్దనే లంక క్రికెట్ బోర్డు నిబంధనను గుణతిలక ఉల్లంఘించాడు. దీంతో బోర్డు తమ ఓపెనర్‌పై వేటు వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రెండో టెస్టు మ్యాచ్ ఫీజును నిలిపేయాలని బోర్డు నిర్ణయించింది.