
కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్.. కుమార సంగక్కార, జయవర్ధనె వైదొలగిన తరువాత ఒక్కసారిగా కుప్పకూలిన జట్టు. 2011లో నిర్వహించిన ప్రపంచకప్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచిన ఆ తరువాత ఆ స్థాయిలో ఆటతీరును కనపర్చట్లేదు. సిరీస్ విజయాల కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. పాతతరం రిటైర్ అయిన తరువాత ఆ జట్టులోకి అన్నీ కొత్త ముఖాలు చేరాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో నెలకొన్న పోటీని తట్టుకోలేకపోతుందా టీమ్. అనుభవజ్ఞులు లేకపోవడం దీనికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి.
తాజాగా- శ్రీలంకకు చెందిన మరో క్రికెటర్ తన కేరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. అతనే ఇసురు ఉడన (Isuru Udana). భారత్‌తో సొంతగడ్డపై ఆడిన శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 సిరీస్ జట్టులో సభ్యుడు. 33 సంవత్సరాల లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. కొద్దిసేపటి కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ రెండు సిరీస్‌లల్లో ఇసురు ఉడన ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. అతని కేరీర్ అర్ధాంతరగా ముగియడానికి ఓ కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండింట్లో ఆడాడు. అయిదు ఓవర్లు మాత్రమే వేసి 39 పరుగులను సమర్పించుకున్నాడు. వికెట్ లెస్‌గా మిగిలాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ అదే పరిస్థితి. మూడు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. రెండు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు వికెట్లను పడగొట్టలేకపోయాడు. గత ఏడాది శ్రీలంక ఆడిన వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆరు వికెట్లు తీశాడు. టీ20ల్లో ఎక్స్‌పెన్సివ్ బౌలర్‌గా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. నిలకడ లేమితో స్థానం కోల్పోయాడు.
కేరీర్ మొత్తం మీద 21 వన్డే ఇంటర్నేషనల్స్, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడాడు. ఈ రెండు ఫార్మట్లను కలిపి 45 వికెట్లను పడగొట్టాడు. ఇందులో టీ20ల వాటా ఎక్కువ. 35 టీ20ల్లో 27 మందిని పెవిలియన్ దారి పట్టించాడు. వన్డేల్లో 237, టీ20ల్లో 256 పరుగులు చేశాడు. వన్డేల్లో ఉడన హయ్యెస్ట్ స్కోర్ 78.. టీ20ల్లో 84. ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న తరువాత.. అతను తన సామర్ధ్యానికి తగినట్టుగా రాణించలేకపోయాడు. భారత్‌తో సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. నిరాశ పరిచాడు.