
హైదరాబాద్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో గురువారం తలపడిన శ్రీలంక జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి పది వికెట్లను పడగొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ఫైనల్ చేరింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన శ్రీలంక ఆతిథ్య బంగ్లాను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. లక్మల్ (3/21), చమీర (2/6), తిసార పెరీర (2/27), సందాకన్ (2/24) విజృంభించడంతో మొదట బంగ్లా 82 పరుగులకే కుప్పకూలింది.
ముష్ఫికర్ (26), సబ్బీర్ రెహ్మాన్ (10) మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని లంక ఓపెనర్లు గుణతిలక (35 నాటౌట్), తరంగ (39 నాటౌట్) 11.5 ఓవర్లలో ఛేదించేశారు. గ్రూప్ దశలో మూడు విజయాలతో బంగ్లాదేశ్ ఇప్పటికే ఫైనల్ చేరింది. ఒకే మ్యాచ్ గెలిచిన జింబాబ్వే నిష్క్రమించింది.