
హైదరాబాద్: శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధం పడింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా బోర్డు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టులో అతని చర్యలను సీరియస్‌గా పరిగణించిన బోర్డు సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజు, బోనస్‌లు కూడా చెల్లించడం లేదని తెలిపింది.
తాజా తప్పిదం కారణంగా అతనిపై మూడు మ్యాచ్‌ల వేటు పడగా... గతేడాది అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించిన గుణతిలక ఏడాదిలోపే మరోసారి నిబంధనలు అతిక్రమించడంతో మరో మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. దీంతో మొత్తం ఆరు మ్యాచ్‌ల నిషేధాన్ని గుణతిలక ఎదుర్కొనున్నాడు.
ఏడాదిలో రెండోసారి నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతడిపై వేటు వేసిన లంక బోర్డు.. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఇదిలా ఉంటే, రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్నపుడు గుణతిలక బస చేసిన హోటల్ గదిలో అతని స్నేహితుడు నార్వే అమ్మాయిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో గుణతిలక విచారణను కూడా ఎదుర్కొంటున్నాడు. విచారణలో భాగంగా గుణతిలకకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే తేల్చిన పోలీసులు... అతని స్నేహితుడుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సస్పెన్షన్ అనంతరం అతను తిరిగి జట్టులోకి ఎంపికవుతాడో లేదో చూడాలి. గతేడాది కూడా అతడు ఆరు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనగా, తర్వాత బోర్డు దాన్ని మూడు మ్యాచ్‌లకు కుదించిన సంగతి తెలిసిందే.