హైదరాబాద్: లంక పర్యటనలో ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన 9-0తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా విరాట్ కోహ్లీపై శ్రీలంక కోచ్ నిక్ పోతాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా జట్టులో కోహ్లీ నిర్దేశించిన ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయని కొనియాడాడు.
శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసిన జట్టుగా ఘన చరిత్ర సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది. 2009-10లో పాక్‌ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది.

అంతేకాదు శ్రీలంక పర్యనటలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యంత విజయవంతం అయ్యాడు. ఈ సిరిస్‌లో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో పాటు తన కెరీర్‌లో 30వ సెంచరీ నమోదు చేసి వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక కోచ్ పోతాస్ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన న్యూజిలాండ్ రగ్బీ జట్టుతో పోల్చాడు. 'మీరోసారి కివీస్ రగ్బీ జట్టును చూడండి. వారంతా నల్లరంగు జెర్సీల్లో ఒకేలా కనిపిస్తారు. ప్రత్యర్థి జట్టు నుంచి వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. బరిలోకి దిగారంటే వారి పోరాటం అద్భుతం. శత్రువును భలేగా దెబ్బతీస్తారు' అని ఏకైక టీ20 అనంతరం నిర్వహించిన మీడియాతో పోతాస్ అన్నాడు.
'వారి ఆట నైతిక విలువలు చాలా గొప్పవి. ఇక్కడ వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన పొరపాట్ల నుంచి మనం ఏం గ్రహించామని. కోహ్లీసేన అలాగే కనిపిస్తోంది. ఈ విషయంలో కోహ్లీకి చాలా గౌరవం లభిస్తోంది. అందరికీ అతడు ఆదర్శం. తనతో పాటు మిగతా వారినీ పైకి తీసుకొస్తాడు. జట్టులో అతడొక సంస్కృతిని ప్రవేశపెట్టాడు. అది బాగుంది' అని అన్నాడు.