
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందే టీమిండియా నుంచి ఇద్దరు కీలక బౌలర్లు తప్పుకొన్నారు. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీ20 స్పెషలిస్ట్ బౌలర్ దీపక్ చాహర్.. టోర్నీ నుంచి వైదొలిగారు. శ్రీలంక ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. ఈ టోర్నమెంట్ మొత్తం నుంచీ తప్పుకొన్నాడు.
తాజాగా ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర కూడా గాయపడ్డాడు. యూఏఈపై జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. చీలమండ గాయానికి గురయ్యాడు. తన బౌలింగ్ కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడు. తన నాలుగో ఓవర్ అయిదో బంతిని వేయడానికి రన్నప్ తీసుకున్న సమయంలో కండరాలు పట్టేశాయి. దీనితో ఆ ఓవర్‌ను పూర్తి చేయలేకపోయాడు. గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. ఆ మిగిలిన ఒక్కబంతినీ శనక వేశాడు.
యూఏఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ అతనే. 3.5 ఓవర్లల్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. యూఏఈ కేప్టెన్ సీపీ రిజ్వాన్, వికెట్ కీపర్ ఆర్యన్ లక్రా, ముహమ్మద్ వసీం వికెట్లనుపడగొట్టాడు దుష్మంత చమీర. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే దిల్షాన్ మధుశంక గాయం వల్ల వైదొలగడంతో బలహీన పడ్డ బౌలింగ్ విభాగాన్ని చమీర బలోపేతం చేశాడనుకున్న దశలో అతను కూడా గాయపడటం లంకేయులకు పెద్ద దెబ్బ.
ఇదివరకే మధుశంక గాయపడ్డ విషయం తెలిసిందే. తొడ కండరాల్లో గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని తేలింది. ఇద్దరు కీలక బౌలర్లు గాయాల బారిన పడి - టోర్నమెంట్ మొత్తం నుంచే తప్పుకోవాల్సి రావడం శ్రీలంక జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. టీమిండియాలాగా శ్రీలంకకు రీప్లేస్‌మెంట్ ప్లేయర్లు కూడా పెద్దగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇది ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీయొచ్చు.