
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం రేగింది. తాజాగా ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్, స్టార్ బ్యాట్స్‌మన్ లహిరు తిరుమానెకు కరోనా సోకింది. దాంతో ఇద్దరినీ వెంటనే క్వారంటైన్‌కి తరలించారు. వీరితో కాంటాక్ట్ అయిన అందరినీ క్వారంటైన్‌లో ఉండాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కోరింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ అసోషియేషన్ బుధవారం ఓ ప్రకటనని విడుదల చేసింది.
'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ నాలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదు. దాంతో నాకు వైరస్ సోకిందా? లేదా? అనే సందేహం కలుగుతోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు లంక క్రికెట్ బోర్డు అధికారులకి తెలియజేసి.. క్వారంటైన్‌లో ఉన్నాను. నేను బాగున్నాను. స్టే సేఫ్' అని లహిరు తిరుమానె వెల్లడించాడు. ఫిబ్రవరి 20 నుంచి వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక టీమ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం కరోనా టెస్టులు చేశారు.
జనవరి 28న వెస్టిండీస్‌తో టూర్ కోసం 36 మందితో (సహాయ సిబ్బందితో సహా) కూడిన జట్టుని శ్రీలంక క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. జట్టుని మూడు గ్రూప్‌లుగా విభజించి ప్రాక్టీస్ చేయిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లను శ్రీలంక ఆడాల్సి ఉంది. ఈ పర్యటన ముంగిట మంగళవారం ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్, నెట్స్ బౌలర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించింది. మిక్కీ ఆర్థర్‌తో పాటు తిరుమానెకి పాజిటివ్ వచ్చింది.
ఇద్దరికి వైరస్ సోకడంతో విండీస్ పర్యటనను రీ షెడ్యూల్ చేసే అవకాశాన్ని లంక బోర్డు పరిశీలిస్తోంది. ఇటీవల శ్రీలంక స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. 0-2తో లంక సిరీస్ కోల్పోయింది. బౌలర్లు, బ్యాట్స్‌మన్‌లు విఫలమవడంతో లంక రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది. ఇంగ్లీష్ స్పిన్నర్లు డోమ్ బెస్, జాక్ లీచ్ ఇద్దరూ 2 టెస్టుల్లో 22 వికెట్లు పడగొట్టారు. ఇక కెప్టెన్ జో రూట్ 426 పరుగులు చేశాడు.