ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు తడబడ్డారు. కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలో దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. బ్రేస్‌వెల్ వేసిన ఒకే ఓవర్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠీ (15) ఇద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది.
ఇలాంటి సమయంలో ఎయిడెన్ మార్క్రమ్ (18)కు జతకలిసిన హెన్రిక్ క్లాసెన్ చెలరేగాడు. కెప్టెన్ మార్క్రమ్ భారీ షాట్లు ఆడేందుకు తడబడుతుంటే.. క్లాసెన్ మాత్రం తన సూపర్ ఫామ్‌తో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదేసిన అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

అయితే సెంచరీ పూర్తయిన కాసేపటికే హర్షల్ పటేల్ వేసిన స్లో యార్కర్‌ను మిస్ జడ్జ్ చేసిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో అతనికి జత కలిసిన హ్యారీ బ్రూక్ (27 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. వీళ్లిద్దరూ మంచి షాట్లు ఆడారు. అయితే డెత్ ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
దీంతో వీళ్లిద్దరూ అనుకున్న విధంగా భారీ షాట్లు ఆడలేకపోయారు. చివర్లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (5)కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. చివరి ఓవర్లో హ్యారీ బ్రూక్ బంతిని కనెక్ట్ చేయడానికి కూడా కష్టపడ్డాడు. ఇక చివరి బంతి ఎదుర్కొన్న ఫిలిప్స్ భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో మంచి టైట్ బౌలింగ్ వేసిన సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రేస్‌వెల్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. హర్షల్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్‌తో రాణించారు. ఈ పిచ్‌పై బ్యాటర్లు కుదురుకుంటే భారీ షాట్లు ఆడటం ఈజీగా మారుతుంది. మరి ఇక్కడ ఆర్సీబీ స్టార్లు ఎలా రాణిస్తారో చూడాలి.