ప్రస్తుతం ఐపీఎల్‌లో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, అదే జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటారు. వీళ్లిద్దరూ ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నారు. ముఖ్యంగా డుప్లెసిస్ అయితే 12 మ్యాచుల్లో 638 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలోనే తన టీం ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ఈ ఆట పట్ల చాలా ప్యాషన్ ఉందని, అది చూసి తాను చాలా ఆశ్చర్యపోతానని అన్నాడు. కోహ్లీ ప్రత్యర్థిగా తాను చాలా ఆడానని, 11వ నెంబర్ బ్యాటర్ అవుటైనప్పుడు కూడా కోహ్లీ ఫుల్ ఎనర్జీతో సెలబ్రేట్ చేసుకుంటాడని చెప్పాడు. అది ఒక్కోసారి ప్రత్యర్థికి కూడా ఊపు తెస్తుందన్నాడు.

'కోహ్లీ గురించి చెప్పుకోవాల్సిన ప్రధానమైన విషయం అతని ప్యాషన్. తన ప్రత్యర్థిగా ఆడినప్పుడు కూడా నేను ఆ ప్యాషన్ చూసి అతన్ని చాలా అభిమానించా. ప్రత్యర్థి జట్టులో పడే ప్రతి వికెట్‌ను కోహ్లీ సెలబ్రేట్ చేసుకుంటాడు. పదకొండో నెంబర్ వికెట్ పడిన సమయంలో కూడా నూటికి నూరు శాతం ఎనర్జీతో ఉంటాడు. ఇంత ప్యాషన్ ఎక్కడి నుంచి వస్తుందా? అని చాలా సార్లు ఆశ్చర్యపోయా' అని చెప్పాడు.
ఇప్పుడు కోహ్లీతో కలిసి ఆడటం మరో కొత్త అనుభూతి అని చెప్పిన డుప్లెసిస్.. 'ఈ అనుభవంతో చెప్తున్నా.. కోహ్లీ ప్రత్యర్థిగా ఆడటం కన్నా, అతనితో కలిసి ఆడటమే చాలా బెటర్' అని నవ్వేశాడు. కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడుతున్నా కూడా అతని ఎనర్జీ, ప్యాషన్ మనలో కూడా ఉత్సాహం పెంచుతుందని డుప్లెసిస్ అన్నాడు. తనకు అది కూడా అనుభవమే అని చెప్పాడు.
'అదే కోహ్లీతో కలిసి ఆడటం చాలా గొప్ప అనుభూతి. ఆడే సమయంలో అతని ప్యాషన్ ఉంటుంది చూశారు. అది ఒక అంటురోగం వంటిది. అది మనకు కూడా వచ్చేస్తుంది. అతనితో కలిసి ఆడుతుంటే.. మనలోని బెస్ట్ ఆట బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ గొప్ప క్రికెటర్ ముసుగులో ఉన్న మనిషి కూడా మనకు పరిచయం అవుతాడు' అని వివరించాడు.
కోహ్లీ చాలా మంచి మనసున్న మనిషి అని డుప్లెసిస్ వెల్లడించాడు. కోహ్లీ, తనకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని చెప్పాడు. 'కోహ్లీ చాలా మంచి మనిషి. చాలా దయ ఉన్నవాడు. నాలాగే పూర్తి ఫ్యామిలీ మ్యాన్. అందుకే మేం ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. కుటుంబం కోసం ఆలోచించడం, ప్యాషన్, ట్యాటూలు ఇలా మా ఇద్దరి అభిరుచులు కూడా చాలా వరకు కలుస్తాయి' అని చెప్పుకొచ్చాడు.