ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను హైదరాబాద్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ పంజాబ్‌ను 100 పరుగులు కూడా చేయకుండానే ఆలౌట్ చేసేలా కనిపించారు. కానీ పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ (99 నాటౌట్) మాత్రం అద్భుతంగా పోరాడాడు.
చిట్టచివరి 11వ నెంబర్ బ్యాటర్‌తో ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన అతను.. భారీ షాట్లతో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని పట్టుదల, అనుభవం అన్నీ బయటపడ్డాయి. ఇది చూసిన ఐపీఎల్ నిర్వాహకులు.. పంజాబ్ ఓడినా అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందించారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో జట్టు ఓడినా ఈ అవార్డు అందుకున్న తొలి ప్లేయర్ ధవన్ కావడం గమనార్హం.

తాను పరిస్థితులకు తగ్గట్లుగానే బ్యాటింగ్ చేశానని, చివరి వరకు క్రీజులో ఉంటానని తను కూడా అనుకోలేదని ధవన్ చెప్పాడు. పిచ్ తాము అనుకున్న దానికి భిన్నంగా ఉండటం వల్లనే వరుసగా వికెట్లు కోల్పోయామని వెల్లడించాడు. అయితే ఇది తమ బ్యాటింగ్ లైనప్‌కు ఒక పాఠం వంటిదన్నాడు. అలాగే తన స్ట్రైక్ రేటు బాగానే ఉందా? శాటిస్ఫై అయ్యావా? అంటూ ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లేను సరదాగా ప్రశ్నించాడు.
ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధవన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు ధవన్ ఏదోలా ఆడేయడానికి ఐపీఎల్‌కు రాలేదని, వన్డే వరల్డ్ కప్‌లో తన చోటు తిరిగి తీసుకోవడానికి వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, తాను సెలెక్టర్ అయినా కూడా గిల్‌కే అవకాశం ఇస్తానని ధవన్ చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.
అప్పుడు తన పెద్ద మనసు చాటుకున్న ధవన్.. తనలో ఇంకా ఆట తగ్గలేదని ఐపీఎల్‌లో నిరూపిస్తున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తను కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ ఫోకస్‌గానే ఆడుతున్నాడని, అతనికి టీమిండియాలో చోటు ఇవ్వాల్సిందేనని భారత అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి ఈ ఐపీఎల్ సీజన్ చివరకు ధవన్ ఎన్ని పరుగులు చేస్తాడో? అతనికి బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు.