సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం హైదరాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో జట్టులోని లోకల్ కుర్రాడు తిలక్ వర్మ జట్టు మొత్తానికి తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ డిన్నర్‌కు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా తదితరులు కూడా తిలక్ వర్మ ఇంటికి వచ్చారు.
వీరంతా డిన్నర్ తర్వాత తిలక్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన ఫొటోలను తిలక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 'నా ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్ హోస్ట్ చేయడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. నేను, నా కుటుంబం ఈ రాత్రిని ఎప్పటికీ మర్చిపోం. వచ్చినందుకు ధన్యవాదాలు' అని తిలక్ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా వీరిలో ఉన్నాడు.

వీరందరికీ హైదరాబాద్ గుర్తుగా చార్మినార్ బొమ్మలను తిలక్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇలా ముంబై జట్టు అంతా తిలక్ వర్మ ఇంట్లో భోజనం చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని, గతంలో అంబటి రాయుడు ఇంటికి కూడా కేవలం భోజనం చేసేందుకు ప్లేయర్లు వచ్చే వారని కొందరు ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత సిరాజ్ వాళ్ల ఇంటికి కూడా టీమిండియా ప్లేయర్లు పలుమార్లు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు కూడా తాము ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండేసి విజయాలు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా పాయింట్ల పట్టికలో కింద స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ 9వ స్థానంలో ఉంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఈ జట్లు.. ఆ మొమెంటం కోల్పోకూడదని అనుకుంటున్నాయి.