వరుసగా రెండు పరాజయాలతో ఐపీఎల్ 2023ని మొదలు పెట్టిన జట్లు. ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు విజయాలు సాధించిన జట్లు. పాయింట్ల పట్టికలో పక్కపక్కనే ఉన్న జట్లు. అవే ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ కూడా మరో రెండు పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మరో మెట్టు పైకి ఎక్కేందుకు రెడీగా ఉన్నాయి.
ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ముంబైలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ ఫామ్ అందుకున్నారు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. అయితే ముంబై బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. పీయూష్ చావ్లా మినహా మిగతా బౌలర్లు ఎవరూ వికెట్లు తీసుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను కనీసం ఇబ్బంది పెట్టడం లేదు.

ఈ క్రమంలోనే ముంబై సాధించిన రెండు విజయాల్లో ఈ జట్టు ఛేజింగే చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుల్లో టార్గెట్లను ముంబై ఇండియన్స్ సులభంగా ఛేదించింది. కాబట్టి సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఛేజింగ్ చేయాల్సి వస్తే ముంబై గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ బలమైన సన్‌రైజర్స్ బౌలింగ్ ముందు ఛేజింగ్ చేయాలన్నా ముంబై బ్యాటర్లు శ్రమించాల్సిందే.
ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసుకున్నా.. లేక పేపర్‌పై ఏది బలమైన జట్టు అని పరిశీలించినా నిపుణులు అందరూ సన్‌రైజర్స్ అని చెప్తున్నారు. ఈ జట్టులో మయాంక్ మార్కండే చాలా కీలకంగా మారాడు. గతంలో ముంబై తరఫున ఆడిన అతను.. ఈ మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే రాణించాల్సిందే. అదే సమయంలో సూర్యకుమార్, తిలక్ వర్మ ఇద్దరూ అతన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కనుక ఛేజ్ చేయాల్సి వస్తే 90 శాతం విజయం ఆరెంజ్ ఆర్మీదే. ఎందుకంటే హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్.. అందరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. దానికితోడు ముంబై బౌలింగ్ అంత గొప్పగా ఏం లేదు. గాయంతో ఉన్న ఆర్చర్ ఆడేది అనుమానమే. దీంతో సన్‌రైజర్స్ ముందు ఎంతటి లక్ష్యం ఉన్నా ఛేదించే సత్తా ఈ జట్టు బ్యాటర్లకు ఉంది. రెండు జట్లు చూసేందుకు సమానంగానే ఉన్నా సన్‌రైజర్స్ కొంత మెరుగ్గా ఉంది. కాబట్టి గెలిచే అవకాశం కూడా ఆ జట్టుకే ఉంది.