ఐపీఎల్ 2023లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ బండి పట్టాలెక్కింది. బలంగా ఉన్న పంజాబ్‌ను ఓడించిన ఈ జట్టు.. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వాళ్ల సొంత మైదానంలో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమైన హ్యారీ బ్రూక్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఈ ఐపీఎల్‌లో అతనిదే తొలి సెంచరీ కావడం గమనార్హం.
హ్యారీ బ్రూక్‌తోపాటు ఎయిడెన్ మార్క్రమ్ (50) కూడా అదరగొట్టాడు. దీంతో సన్‌రైజర్స్ 228 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్‌లో శుభారంభం దక్కకపోయినా కేకేఆర్ చివరి వరకు పోరాడింది. భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఆ ఓవర్‌లో రాణా ఏకంగా 28 పరుగులు చేశాడు. అనంతరం రింకూ సింగ్ (58 నాటౌట్) క్రీజులో ఉండటంతో కేకేఆర్ గెలిచేలా కనిపించింది. కానీ చివరకు 23 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. దీనిపై స్పందించిన కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. తమ బౌలింగ్‌ను తప్పుబట్టాడు. ఈ పిచ్‌పై కనీసం 200 పరుగులు చేస్తారని తాము కూడా భావించామని, కానీ 230కు సమీపంలో ఉండే ఏ టార్గెట్ అయినా ఛేదించడం కష్టమని చెప్పాడు.
'మేం అనుకున్నట్లు బౌలింగ్ చేయలేదు. వికెట్ ఎలా ఉన్నా కూడా 230 అంటే చాలా భారీ స్కోరు. ఇంకొంచెం మంచిగా బౌలింగ్ చేసి ఉండాల్సింది. గుజరాత్‌పై రింకూ గెలిపించినట్లు ప్రతి మ్యాచ్‌లో జరగదు అని మాక్కూడా తెలుసు. కానీ నేను, రింకూ బ్యాటింగ్ చేసిన విధానం నాకు సంతోషం కలిగించింది. రింకూ, రస్సెల్ ఇద్దరికీ సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనే చెప్పా' అని నితీష్ రాణా వెల్లడించాడు.
'నేను ఒక ఎండ్‌లో వికెట్ కాపాడుకుంటూ భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నా. ఇక్కడి పిచ్ ఇలాగే ఉంటుందని మాకూ తెలుసు. కనీసం 200 టార్గెట్ ఉంటుందని ముందే ఊహించాం. ఇకపై కూడా ఇది ఇలాగే ఉంటుంది. మా మెయిన్ బౌలర్లే భారీగా పరుగులు ఇచ్చేస్తే నేనేం చెయ్యలేను కదా.
ఎందుకంటే వాళ్లే మనల్ని చాలా మ్యాచుల్లో గెలిపిస్తారు కూడా. ఇవాళ వాళ్లకు మంచి రోజు కాదంతే. పర్లేదు. మేం చూపెట్టిన పోరాటం బాగా సంతోషాన్ని కలిగించింది. ఆ రెండు పాయింట్లు కూడా వచ్చి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేవాళ్లం' అని రాణా పేర్కొన్నాడు.