SRH vs RCB: ఐపీఎల్ 2025లో శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆడకుండానే ప్రయోజనం పొందింది.
లాభపడిన పంజాబ్ కింగ్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ జట్టుపై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆర్సీబీని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానం నుంచి నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఓటమి తర్వాత ఆర్సీబీ నెట్ రన్ రేట్ తగ్గింది. మరో వైపు పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే వారు నేరుగా అగ్రస్థానానికి చేరుకుంటారు.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు 18 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పుడు టాప్-2లో నిలిచి ఉండేందుకు ఒక సువర్ణావకాశం లభించింది. పంజాబ్ కింగ్స్ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే.. ఆ జట్టు 21 పాయింట్లను కలిగి ఉంటుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్తుంది. అదే జరిగేతే పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫైనల్ చేరుకోవడానికి 2 అవకాశాలు లభిస్తాయి.
42 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆర్సీబీ
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో అత్యధికంగా 94 పరుగులు సాధించగా.. అభిషేక్ శర్మ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో ఆర్సీబీ జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ అత్యధికంగా 62 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కెప్టెన్ పాట్ కమిన్ గరిష్టంగా 3 వికెట్లు పడగొట్టాడు.