రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ ఉండదు. అయినప్పటికీ 'ఈ సాలా కప్ నమదే' కల ఇప్పటికీ తీరలేదు. గొప్ప బ్యాటర్లు ఉన్నప్పటికీ బౌలింగ్ వైఫల్యంతోనే ఆర్సీబీ టైటిల్ అందుకోవట్లేదని సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయపడుతుంటారు. కానీ ఆర్సీబీ ఓటములకు మరో ప్రధాన కారణం ఉందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు. బెంగళూరు బ్యాటింగ్‌లోనూ జట్టుకూర్పు సక్రమంగా లేదని, ప్రణాళిక లేమి ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తుందని వివరించాడు.
''కేవలం వ్యక్తుల ప్రదర్శన ఆధారంగా జట్టు విజయాలు సాధించవని ఆర్సీబీ నిరూపిస్తోంది. మీరు పెద్దపెద్ద స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయండి. వాళ్లను జట్టుగా ఏర్పాటు చేయండి. కానీ అది మిమ్మల్ని గెలుపు తీరాలకు చేర్చలేదనే విషయాన్ని గత కొన్నాళ్లుగా బెంగళూరు చాటిచెబుతోంది. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్ వంటి అసాధారణమైన ప్లేయర్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించారు. కానీ టైటిల్ సాధ్యం కాలేదు''

''జట్టులో ఓ స్థానానికి సరిపోయే ఆటగాళ్లు ఉండాలి. తమ పాత్రను తెలుసుకోవాలి. అలా లేని సమయంలో తగ్గట్లుగా ఆటగాళ్ల స్థానాలు మార్చుకోవాలి. కానీ ఇవన్నీ ఆర్సీబీ చేస్తుందని నేను భావించట్లేదు. విరాట్ కోహ్లి ఓపెనర్ బరిలోకి దిగిన వెంటనే ప్రత్యర్థి జట్లు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయిస్తుంది. ఆఫ్ సైడ్ ఇద్దరు ఫీల్డర్లను మోహరించి పరుగులను నియంత్రిస్తుంది''
''ఇలాంటి స్థితిలో ఆర్సీబీ ఎలా ఆలోచించాలి? 'ఓకే, ప్రత్యర్థి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో వస్తుంది కాబట్టి ఎడమచేతి వాటం బ్యాటర్లను బరిలోకి పంపిద్దాం. విరాట్‌ను వన్‌డౌన్‌లో దించుదాం' అని ప్లాన్ చేయాలి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ దూకుడుగా ఆడి కొన్ని బౌండరీలు బాదితే తొలి ఓవర్‌లోనే 13 నుంచి 15 పరుగులు సాధించవచ్చు. కానీ ఆర్సీబీ అలా భిన్నంగా ఆలోచించట్లేదు''
''జట్టులో ప్రధాన ఆటగాళ్లు ఉన్నారని, విజయం సాధిస్తామని ధీమాతో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ, ఆ ఆలోచన తప్పు. జట్టు సంస్కృతి, నైతికత, ప్రతి ఆటగాడికి తమ విధి తెలిసేవరకు జట్టులో ఎంత గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ విజయం సాధించలేరని ఆర్సీబీ పదేపదే నిరూపిస్తోంది'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. కాగా, ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ టేబుల్ లాస్ట్‌లో ఉంది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ బెంగళూరు తలపడనుంది.