
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్ది సేపట్లో సూపర్ మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై రెండు మార్పులు చేసింది. కృనాల్ పాండ్యా. పీయూష్ చావ్లా జట్టులోకి రాగా.. సౌరబ్ తివారి, జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు కోల్పోయారు. ఇక మనీష్ పాండే హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. గాయం కారణంగా కేన్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ దూరం కాగా మొహ్మద్ నబి జట్టులోకి వచ్చాడు.
సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులో లేదు కాబట్టి విజయంతో టోర్నీని ముగించాలని చూస్తోంది. అయితే ఈరోజు ముంబైకి విజయం చాలా కీలకంగా మారింది. కోల్‌కతా విజయం తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం జరిగితే మాత్రమే రోహిత్ సేన ప్లే ఆఫ్‌కి చేరుతుంది. అందుకే భారీ విజయమే లక్ష్యంగా ముంబై బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచులో 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్‌కతాను వెనక్కినెట్టి ముంబై ముందడుగు వేసే అవకాశం ఉంది. కానీ అది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ముంబై -0.048 రన్‌రేట్‌తో ఉంది. మోర్గాన్ టీమ్ +0.587 నెట్ రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్2021 లీగ్ దశ ఈరోజుతో ముగియనుంది. శుక్రవారం ఒకే సమయానికి రెండు మ్యాచులు ఆరంభం కానున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా.. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచులు రాత్రి 7.30కు ప్రారంభం కానున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్లు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 8 సార్లు గెలుపొందగా.. ముంబై 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో హైదరాబాద్, ముంబై తలపడిన మ్యాచులో రోహిత్ సేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో ఒకటి హైదరాబాద్, నాలుగు ముంబై గెలిచింది. అబుదాబి మైదానంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఈరోజు ఆడేదే తొలి మ్యాచ్. షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. ఇన్నింగ్స్ మధ్యలో స్పిన్నర్లు, చివరలో పేసర్లకు పిచ్ అనుకూలంగా ఉండనుంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: జేసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీశ్ పాండే (కెప్టెన్), ప్రియమ్ గార్గ్, జేసన్ హోల్డర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మహమ్మద్ నబి, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్, సిద్దార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, కీరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్ నైల్, పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.