MI VS SRH: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచుల్లో ముంబయి జట్టుకు ఇది మూడో విజయం.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి బ్యాటర్లందరూ మంచి ప్రదర్శనే చేశారు. రియాన్ రికల్టన్ (23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 31 పరుగులు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 26 రన్స్), విల్ జాక్స్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 36 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 26 రన్స్) రాణించారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య 9 బంతుల్లో ఏకంగా 233.33 స్ట్రైక్ రేటుతో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 21 పరుగులు దూకుడుగా ఆడాడు. విజయానికి 14 బంతుల్లో 2 పరుగులు అవసరమైన నేపథ్యంలో మ్యాచును సిక్స్ బాది ముగిద్దామనుకున్నాడు. కానీ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే నమన్ ధీర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తిలక్ 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీయగా.. ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2 పరుగులు) మళ్లీ నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు) బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఫీల్డింగ్ లో బానే రాణించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 37 రన్స్) కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కానీ దూకుడు ఉన్న అతడిని.. బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ (8 బంతుల్లో 18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (8) కాసేపు దూకుడుగా ఆడి నాటౌట్ గా నిలిచారు. వీరిద్దరు ఆఖరి ఓవర్లలో మూడు సిక్సులు బాదారు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెండ్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.