ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఉప్పల్ వేదికగా నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ పోరులో ముంబై ఓ గొప్ప & చెత్త రికార్డులు నమోదుచేసింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా, ఛేదనలో అత్యధిక స్కోరు సాధించిన టీమ్‌గా రికార్డులకెక్కింది. అయితే ఈ ఓటమిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రైమ్ బౌలర్ బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందివ్వడం ముంబైకు తీవ్రంగా నష్టం వాటిల్లేలా చేసింది.

పరుగుల వరదను కట్టడి చేయలేక హైదరాబాద్ ఇన్నింగ్స్ మధ్యలో హార్దిక్ నుంచి రోహిత్ తాత్కాలికంగా బాధ్యతలు అందుకున్నాడు. అది ముంబై జట్టుకు కాసేపు ఉపశమనం కలిగించినా బౌండరీలను కట్టడి చేయలేకపోయారు. ఓటమి అనంతరం హార్దిక్ మాట్లాడుతూ అనుభవం లేని బౌలర్లు జట్టులో ఉండటం వల్ల అత్యధిక పరుగులు సమర్పించుకున్నామని వివరణ ఇచ్చాడు. కానీ జట్టులో హార్దిక్, బుమ్రా, చావ్లా వంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు.
అయితే ఓటమి అనంతరం ముంబై ఫ్రాంచైజీ పెద్దలు డగౌట్ వద్దనే రోహిత్‌తో చాలాసేపు మాట్లాడారు. ఓటమికి గల కారణాలను రోహిత్ కోణంలో తెలుసుకున్నారు. హార్దిక్ వ్యూహాలపై ఫ్రాంచైజీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. రోహిత్‌కు ఇష్టమైతే తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలనే ప్లాన్‌లోనూ ఉందని సమాచారం. మ్యాచ్ సమయంలో కెప్టెన్సీ మార్పు గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారని, త్వరలో రోహిత్ తన స్థానాన్ని మార్చుకుంటాడని హర్షా భోగ్లే అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే..523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్‌రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.
అనంతరం ఛేదనలో ముంబై అసాధారణ పోరాటం చేసింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు.