హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జట్టు సాధించిన హ్యాట్రిక్ విక్టరీ ఇది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన ముంబై- తొలి రెండింట్లో ఓడింది. చివరి మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించింది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
ఈ నెల 22వ తేదీన తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది ముంబై ఇండియన్స్. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. మరోవంక- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పరాజయాలు వీడట్లేదు. సొంత గ్రౌండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి చవి చూసింది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ మూడింట్లో ఓడింది.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓడింది సన్‌రైజర్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దీన్ని ఛేదించలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ. 19.5 ఓవర్లల్లో 178 పరుగుల వద్ద ఆ జట్టు ప్రస్థానం నిలిచిపోయింది.
ముంబై జట్టులో కామెరాన్ గ్రీన్ టాప్ స్కోరర్. 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. హైదరాబాదీ తిలక్ వర్మ 37 పరుగులతో రాణించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 28 పరుగులే చేసినప్పటికీ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. ఆరు ఫోర్లు బాదాడు. టీ నటరాజన్ బౌలింగ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు. హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున మూడు సంవత్సరాల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడానని, ఐపీఎల్ కప్‌ను కూడా గెలిచామని పేర్కొన్నాడు. ఇక్కడి గ్రౌండ్స్, ఫ్యాన్స్‌తో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. మరోసారి హైదరాబాద్‌కు రావడం, మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉందని చెప్పాడు.
గతంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున మూడు సంవత్సరాల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు రోహిత్. 2008 నుంచి 2010 మధ్యకాలంలో 47 మ్యాచ్‌లు ఆడాడు. 1,219 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఎనిమిది అర్ధసెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగతంగా అతని హయ్యెస్ట్ స్కోర్ 76. బ్యాటింగ్ సగటు 30.47. 130.37 స్ట్రైక్ రేట్‌తో దక్కన్ ఛార్జర్స్‌లో అతని బ్యాటింగ్ దూకుడు కొనసాగింది.