SRH vs MI: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసింది. మూడో ఓవర్లో ఒక వింత జరిగింది. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్లో మొదటి బంతి లెగ్ స్టంప్ వెలుపల పడింది. ఇషాన్ కిషన్ దానిని ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఎవరూ అప్పీల్ చేయలేదు. ఎవరు అప్పీల్ చేయనప్పటికీ ఇషాన్ కిషన్ పెవిలియన్ కు తిరిగి రావడం ప్రారంభించాడు. కానీ రీప్లేలో బంతి ఇషాన్ కిషన్ బ్యాట్ ను తాకలేదని తేలింది. ఇషాన్ కిషన్ వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో అతని నిజాయితీకి హార్దిక్ పాండ్యా ప్రశంసించాడు.
బంతి ఎక్కడా తగలలేదు..
ఇషాన్ కిషన్ పెవిలియన్ కు బయలుదేరడం ప్రారంభించిన వెంటనే దీపక్ చాహర్ అప్పీల్ చేయడానికి తన చేయి పైకెత్తాడు. అంపైర్ కూడా కంగారుపడి వేలు పైకెత్తాడు. దీని తర్వాత హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ ను చేరుకున్నాడు. ఇషాన్ కిషన్ తలపై చేయి వేసి చప్పట్లు కూడా కొట్టాడు. కానీ స్నికోమీటర్ రీప్లే వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి బంతి ఇషాన్ కిషన్ బ్యాట్ ను తాకలేదు. అతని శరీరంలోని ఏ భాగాన్ని కూడా తాకలేదు. అది చాలా దూరం నుంచి వెళ్లింది. కానీ దీని తర్వాత కూడా ఇషాన్ కిషన్ పెవిలియన్ వదిలి వెళ్లాడు.

అయితే చాలా మంది నెటిజన్లు ఈ రోజు మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇషాన్ కిషన్, అంపైర్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల నటన అంత గొప్పగా లేదని విమర్శిస్తున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఇషాన్ కిషన్.. ఆ జట్టుకు ఫేవర్ గా ఆడుతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్ రివ్యూ కూడా కోరకుండా పెవిలియన్ బాట పట్టడమేంటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.