
అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దాంతో సన్‌రైజర్స్ ముందు 236 పరుగుల కొండంత లక్ష్యం ఉంచింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (84, 32 బంతుల్లో 11x4, 4x6) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాధగా.. సూర్యకుమార్ యాదవ్ (82, 40 బంతుల్లో 13x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (18), హార్దిక్ పాండ్యా (10), కీరన్ పోలార్డ్ (13) విఫలమయ్యారు. ఇషాన్, సూర్యకుమార్ ధాటికి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సిద్దార్థ్ కౌల్ తన కోటా నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా రెండు వికెట్లు పడగొట్టినా .. 40 రన్స్ ఇచ్చాడు. అయితే అభిషేక్ శర్మ మాత్రం ఒక ఓవర్ వేసి రెండు వికెట్లు పడగొట్టి 4 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచులో విజయం సాధించడం ముంబైకి చాలా కీలకం. రోహిత్ సేన ప్లే ఆఫ్‌కి చేరాలంటే భారీ విజయం అవసరం. గత రాత్రి కోల్‌కతా విజయం సాధించడంతో రోహిత్ సేన ప్లే ఆఫ్ ఆశలకు ఎసరొచ్చింది. ఇప్పుడు 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్‌కతాను వెనక్కినెట్టి ముంబై ముందడుగు వేసే అవకాశం ఉంది. అంటే ముంబై 235 పరుగులు చేసింది కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును 65 పరుగులకే కట్టడి చేయాల్సి ఉంది. ఇప్పుడు ముంబై టార్గెట్ 65 పరుగులే. అయితే ఇది దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. చూద్దాం మరి ఏదైనా అద్భుతం జరుగుతుందో.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంతసేపూ మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (18) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రషీద్ ఖాన్ వేసిన 5.3 బంతికి ఔట్ అయ్యాడు. మహమ్మద్ నబి చేతికి చిక్కి రోహిత్ పెవిలియన్ చేరాడు. వికెట్ పడినప్పటికీ ఇషాన్ దాటిగానే ఆడాడు. ఈ క్రమంలో ఇషాన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అదే సమయంలో 7.2 ఓవర్లలోనే ముంబై స్కోరు వంద పరుగులు దాటింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్దిక్ పాండ్య (10), కీరన్ పొలార్డ్ (13) ఆకట్టుకోలేకపోయారు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఇషాన్ కిషన్ మాత్రం పరుగుల వరద పారించాడు. ఇషాన్ ఊపు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ అతడి జోరుకు కళ్లెం వేశాడు. మాలిక్ వేసిన పదో ఓవర్లో ఇషాన్ కీపర్ వృద్దిమాన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకున్నాడు. సూర్య కూడా సిక్సులు, ఫోర్లతో అలరించాడు. ఏ క్రమంలోనే సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో చివరి ఓవర్లో ఔట్ అయ్యాడు. జేమ్స్ నీషమ్ (0), కృనాల్ పాండ్యా (9), నాథన్ కౌల్టర్ నైల్ (3), పియూష్ చావ్లా (0) రాణించలేకపోయారు. చివర్లో వచ్చిన బుమ్రా (5), బౌల్ట్ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు.