
ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. లక్నోసూపర్ జెయింట్స్ విసిరిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక బ్యాటింగ్ వైఫల్యంతో 12 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 4 కీలక వికెట్లతో లక్నో విజయంలో ఆవేష్ ఖాన్ కీలకపాత్ర పోషించాడు. కాగా ఇప్పటికే మొదటి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రైజర్స్ తొలి విజయం కోసం మళ్లీ ఎదురుచూడక తప్పడం లేదు. అయితే మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడాడు.
గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో తమ ప్రదర్శన మెరుగ్గా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. పవర్‌ప్లేలో బంతితో తమ ఆరంభం బాగుందని అన్నాడు. అయితే కేఎల్ రాహుల్, దీపక్ హుడా భాగస్వామ్యాన్ని కాస్త ముందుగా విడదీసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది మంచి వికెట్ అని చెప్పిన విలియమ్సన్.. ఇక్కడ 170 పరుగులు చేయడం సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు. అయితే ఆ లక్ష్యాన్ని చేధించే శక్తి తమకు ఉన్నప్పటికీ అది ఈ రోజ జరగలేదని చెప్పాడు. బౌలింగ్ యూనిట్ తమ పనిని చేసిందని తెలిపాడు. ఇది చిన్న మార్జిన్‌ల ఆట అని చెప్పిన విలియమ్సన్.. ప్రత్యర్థి తమ కంటే ముందుకు వెళ్లకుండా మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం అని చెప్పాడు.
ఇక మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో రాహుల్ 68, దీపక్ హుడా 51 పరుగులతో రాణించాడు. ఆయుష్ బదోని 19, మనీష్ పాండే 11 పరుగులు చేయగా.. మిగతా వారు రెండెంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, షెపర్డ్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి 44, నికోలస్ పూరన్ 34 పరుగులతో రాణించారు. సుందర్ 18, విలియమ్సన్ 16, అభిషేక్ శర్మ 13, మాక్రమ్ 12 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ 4, హోల్డర్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు. ఆవేష్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.