16 పరుగులకే ఔట్
అసలు ఏం జరిగిందంటే లక్నోసూపర్ జెయింట్స్ విసిరిన 170 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే లక్నో పేస్ బౌలర్ ఆవేష్ ఖాన్ వేసిన నాల్గో ఓవర్‌లోని మూడో బంతిని సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ల మీదుగా వెనుకవైపుగా ఆడాడు. కానీ బాల్ అనుకున్న ఎత్తులో రాకపోవడంతో వెనుకవైపు ఫీల్డింగ్ చేస్తున్న ఆండ్రూ టైకి క్యాచ్ ఔట్‌గా దొరికపోయాడు. దీంతో విలియమ్సన్ 16 పరుగులకే వెనుదిరిగాడు. అటు హైదరాబాద్ కూడా 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

అది నో బాల్
అప్పుడు పవర్ ప్లే కొనసాగుతుంది. కనుక పవర్ ప్లే రూల్ ప్రకారం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్ సర్కిల్ వెలుపల ఉండాలి. కానీ విలియమ్సన్ ఔటైన సమయంలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల ముగ్గురు ఫీల్డర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం అలాంటి సమయంలో వేసిన బాల్స్‌ను నో బాల్‌గా ప్రకటిస్తారు.
ఒక వేళ బ్యాటర్ ఔటైనప్పటికీ ఔట్ ఇవ్వరు. కానీ విలియమ్సన్ ఔటైనప్పుడు 30 యార్డ్ సర్కిల్ వెలుపల ముగ్గురు ఫీల్డర్లు ఉన్న విషయాన్ని అంపైర్లు గమనించలేదు. దీంతో విలియమ్సన్‌ను ఔట్‌గా ప్రకటించారు.
కానీ ఈ విషయాన్ని గమనించిన పలువురు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు తమ జట్టుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేన్ మామను అంపైర్లు మళ్లీ మెసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

గత మ్యాచ్‌లోనూ ఇలాగే
రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ కేన్ విలియమ్సన్ విషయంలో ఇలాగే జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ పట్టుకున్నాడు. అయితే పడిక్కల్ క్యాచ్ తీసుకోవడానికి ముందే బంతి నేలను తాకింది. థర్డ్ అంపైర్ రివ్యూలో కూడా స్పష్టంగా కనిపించింది.
అయినప్పటికీ థర్డ్ అంపైర్ దానిని ఔట్‌గా ఇవ్వడం పెద్ద దుమారానికి దారి తీసింది. అప్పటికి విలియమ్సన్ 2 పరుగులే చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఫిర్యాదు చేసింది. తాజాగా మరోసారి కూడా అలాంటి వివాదమే నెలకొనడంతో ఈ సారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రెండు సార్లు కేన్ విలియమ్సన్ అంపైర్ల తప్పుడు నిర్ణయానికి బలి కావడంతో సన్‌రైజర్స్ సైతం ఈ రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది.

హైదరాబాద్ ఓటమి
ఇక మ్యాచ్ విషయానికొస్తే లక్నోసూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా... అనంతరం హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది.


Click it and Unblock the Notifications












