
తొలి బంతుల్ని సరిగా వేయలేదు:
మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'ఈ వికెట్‌పై ఎక్కువ పరుగులు చేయడం కష్టం. కోల్‌కతా పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంది. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పింది. చాలా ఓవర్లలో మేం తొలి బంతుల్ని కట్టుదిట్టంగా విసరడంలో విఫలమయ్యాం. దాంతో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. మా బ్యాటింగ్ సమయంలో త్వరగా వికెట్లు చేజార్చుకున్నాం. బెయిర్ స్టో, మనీశ్ అవకాశాలు సృష్టించారు. కానీ తేమ ప్రభావం చూపించింది' అని అన్నాడు.

ఆటగాళ్లు పొడవుగా ఉన్నారు:
'బౌలర్లు పుల్ లెంగ్త్ బంతులు వేసుకుంటే షాట్లు ఆడేందుకు బాగుండేది. పైగా కోల్‌కతా జట్టులో ఆటగాళ్లు పొడవుగా ఉన్నారు. క్రాస్‌సీమ్ బంతులతో మమ్మల్ని బాగా అడ్డుకున్నారు. తొలి మ్యాచ్ గెలిస్తే బాగుండేది. ఈ వేదికలో మాకు మరో నాలుగు మ్యాచులు ఉన్నాయి. పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచులో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటాం. వచ్చే మ్యాచులలో విజయమే మా లక్ష్యం' అని సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. కోల్‌కతా జట్టులో పేసర్లు ప్రసిద్ధ్, కమిన్స్, రసెల్ పొడుగ్గా ఉంటారనేది నిజమే. వార్నర్ ఆరంభ మ్యాచులో విఫలమయ్యాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌన్సర్‌కు అతడు పెవిలియన్ చేరాడు.

అదే మా కుర్రాళ్లలో జోష్ నింపింది:
'శుభారంభం చేయడం ఆనందం కలిగించింది. లీగ్ ముందు ఏర్పాటు చేసిన శిబిరం మా కుర్రాళ్లలో జోష్ నింపింది. నితీశ్, త్రిపాఠి బాగా ఆడి భారీ స్కోరుకు పునాది వేశారు. బౌలింగ్ కూడా బాగుంది. పవర్‌ప్లేలో బౌలింగ్‌లో మార్పులు చేశాం. పరిస్థితులను బట్టి మైదానంలో నిర్ణయాలు తీసుకున్నాం. బ్రెండన్ మెక్‌కలమ్ రూపంలో మాకు మంచి కోచ్ ఉన్నారు. ఐపీఎల్ అంటే ఫలితాలే. హర్భజన్ సింగ్ ఆరంభ ఓవర్‌ను చక్కగా వేశాడు. ఆ తర్వాత బంతి ఇవ్వకున్నా.. తన అనుభవంతో సలహాలు ఇచ్చాడు. మైదానంలో ఆటగాళ్లంతా నిస్వార్థంగా ఆడారు' అని కోల్‌కతా సారథి ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

బంతులు వేగంగా వేసేందుకు ప్రయత్నిస్తున్నా:
'బంతులు వేగంగా వేసేందుకు ప్రయత్నిస్తున్నా. వికెట్‌లో వేగం లేదు. అందుకే బంతిని బలంగా విసిరేందుకు ప్రయత్నించా. మాకు పది రోజులు శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ మెరుగులు దిద్దుకున్నాం. వికెట్ నెమ్మదిగా ఉంది. సరైన ప్రాంతాల్లో బంతులు వేసేందుకు కష్టంగా ఉందని గమనించా. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ టోర్నీల్లో ఆడటం వల్ల నా ప్రదర్శన మెరుగైంది. రాణా, త్రిపాఠి అదరగొట్టారు. లీగులో మేం రాణిస్తామని అనుకుంటున్నా. మా జట్టులో భారీ హిట్టర్లు ఉన్నారు' అని కోల్‌కతా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పేర్కున్నాడు.


Click it and Unblock the Notifications












