SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 పదో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు. స్టార్క్ తన స్పెల్ రెండో ఓవర్లోనే ఇద్దరు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లను ఔట్ చేయడం ద్వారా సంచలనం సృష్టించాడు. ఢిల్లీ తరఫున ఇన్నింగ్స్ లో మూడో ఓవర్ వేయడానికి వచ్చిన స్టార్క్.. మొదటి బంతికే ఇషాన్ కిషన్ ను వికెట్ వెనుక క్యాచ్ గా తీసుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇషాన్ కిషన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్ లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన ఇషాన్ కిషన్ తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన తర్వాత మిచెల్ స్టార్క్ తన బౌలింగ్‌తో సన్ రైజర్స్‌కు చెందిన మరో స్టార్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ ను తీసుకున్నాడు.
ఇషాన్ కిషన్ ను ఔట్ చేసిన తర్వాత స్టార్క్ వేసిన రెండో బంతి వైడ్ కావడంతో కీపర్ కేఎల్ రాహుల్ బంతిని అందుకోలేకపోయాడు. దాని కారణంగా సన్‌రైజర్స్‌కు ఐదు పరగులు వచ్చాయి. దీని తర్వాత స్టార్క్ తదుపరి బంతికి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. నితీష్ కుమార్ రెడ్డి తన ఖాతా తెరవడానికి చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో స్టార్క్ ఫుల్ లెంత్ బంతిని వేశాడు. దానిని నితీష్ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది నేరుగా బౌండరీ దగ్గర నిలబడి ఉన్న కెప్టెన్ అక్షర్ పటేల్ చేతుల్లోకి వెళ్లింది. ఈ విధంగా నితీష్ కుమార్ రెడ్డి ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు.

స్టార్క్ ముందు ట్రావిస్ హెడ్ కూడా విఫలం
ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను ఔట్ చేసిన తర్వాత మిచెల్ స్టార్క్ ట్రావిస్ హెడ్ ను కూడా వదిలిపెట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వచ్చిన ట్రావిస్ హెడ్.. బ్యాటింగ్ చేస్తున్నపుడు ప్రారంభం నుంచే అసౌకర్యంగా కనిపించాడు. హెడ్ ప్రయత్నాలు చేసినప్పటికీ పరుగులు రాలేదు. ఆ పరిస్థితిలో మిచెల్ స్టార్క్‌పై రిస్క్ తీసుకోవాలని హెడ్ ప్రయత్నించాడు. కానీ విజయం సాధించలేదు. ట్రావిస్ హెడ్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ కమ్మిన్స్ నిర్ణయం సరైనది కాదని నిరూపించబడింది.