
షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. 18 పాయింట్లతో అధికారిక బెర్త్ దక్కించుకుంది. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో చెన్నై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఘనత సాధించింది. షార్జా వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45; 38 బంతుల్లో 4×4, 2×6), ఫాఫ్ డుప్లెసిస్ (41; 36 బంతుల్లో 3×4, 2×6), అంబటి రాయుడు (17 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచులో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభం (మధ్యలో ఒక సీజన్ మినహా) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడుతున్న ధోనీ.. వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు అందుకున్నాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా మహీ ఈ ఘనతను అందుకున్నాడు. ధోనీ తర్వాత ఒకే జట్టుకు ఆడుతున్న జాబితాలో సీఎస్‌కే స్టార్ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రెండో స్థానంలో ఉన్నాడు. రైనా 98 క్యాచ్‌లు అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ 94 క్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
మొత్తంగా ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 119 క్యాచ్‌లు అందుకున్నాడు. మహీ 215 మ్యాచ్‌ల్లో 119 క్యాచ్‌లు, 39 స్టంప్స్‌లు చేశాడు. మొత్తంగా 158 ఔట్‌లలో పాలుపంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ధోని వికెట్ కీపర్‌గా ఒకే మ్యాచ్‌లో ముగ్గురి కంటే ఎక్కువ బ్యాట్స్‌మెన్ క్యాచ్‌లు తీసుకోవడం ఇది పదోసారి. గత మ్యాచులో జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్ క్యాచులను మహీ అందుకున్నాడు. ధోనీ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 5 సార్లు ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ బ్యాటర్స్ క్యాచ్‌లు తీసుకొని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కే జట్టుకే ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. మొదటి సీజన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ భుజాన వేసుకున్నాడు. వయసుపైబడిన ఆటగాళ్ల నుంచి కూడా మహీ అత్యుత్తమ ఆటను రాబడుతున్నాడు. షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లే ఇదుకు చక్కని ఉదాహరణ. అటు కుర్రాళ్లను కూడా సానబెడుతున్నాడు. ఇక జట్టు ఎంపికలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. ఏ విభాగంలో ఏ ప్లేయర్ కావాలో అతడికి బాగా తెలుసు. ఓ ఆటగాడిపై నమ్మకం ఉంచి గాడిలో పడేవరకు అవకాశాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే మహీ సారథ్యంలో చెన్నై జట్టు ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. మరోసారి టైటిల్ దిశగా అడుగులేస్తోంది.