
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్లు 16 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్‌కే 12 సార్లు గెలుపొందగా.. ఎస్‌ఆర్‌హెచ్ 4 మాత్రమే విజయాలు అందుకుంది. గతేడాది షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచులో సీఎస్‌కే గెలుపొందింది. గత ఐదు మ్యాచులో చెన్నై మూడు గెలువగా.. హైదరాబాద్ రెండు విజయాలు అందుకుంది. ఇక ఐపీఎల్ 2021లో ఈ రెండు తలపడిన మ్యాచులో చెన్నై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 5.. రెండోసారి బ్యాటింగ్ చేసినప్పుడు హైదరాబాద్ 2, చెన్నై 7సార్లు గెలుపొందాయి. షార్జా క్రికెట్ స్టేడియంలోని పిచ్ గతంలో మాదిరిగా లేదు. పిచ్ నెమ్మెదిగా ఉండడంతో ఈ సంవత్సరం పరుగులు చేయడానికి బ్యాటర్లు కష్టపడుతున్నారు.

అదరగొడుతున్న ఓపెనర్లు
ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా యూఏఈలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ రోజు గెలిస్తే అధికారిక బెర్త్ దక్కనుంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మొదట బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా వీరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు.
వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అలీ వేగంగా ఆడుతూ విలువైన పరుగులు చేస్తున్నాడు. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. మహీ ఒక్కడు గాడిలో పడితే.. బ్యాటింగ్ విభాగంలో చెన్నైకి ఎదురులేదు.

కరన్ స్థానంలో బ్రావో
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటిచేత్తో మ్యాచులు మలుపు తిప్పగలడు. ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలడు. అంతేకాదు బంతితో కూడా రాణించగలడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అయితే అతను సామ్ కరన్ స్థానంలో తిరిగి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
అయితే కీలక ప్లే ఆఫ్ కోసం అతడిని తాజాగా ఉంచేందుకు రెస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్ కూడా తమ బాధ్యత నిర్వర్తిస్తూ విజయాల్లో భాగమవుతున్నారు. దీంతో హైదరాబాద్ జట్టుపై గెలుపు వీరికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. అయితే ఎలాగూ ప్లే ఆఫ్ వెళ్లింది కాబట్టి చెన్నై కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.

సన్‌రైజర్స్ రాణిస్తేనే
గత మ్యాచులో గెలిచిన ఆనందంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. కీలక మార్పులు చేసి ఫలితాన్ని అందుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో ఆడిన జాసన్ రాయ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మరోసారి ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. మనీష్ పాండే స్థానంలో ఆడిన అభిషేక్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. అబ్దుల్ సమద్, ప్రియం గార్గ్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది.
మరోవైపు జట్టు మిడిలార్డర్లో నిలకడలేకపోవడం కలవరపెడుతోంది. జాసన్ హోల్డర్, జే సుచిత్,భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ రాణిస్తేనే చెన్నై ఎక్కువ పరుగులు చేయకుండా ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ జట్టుకు కూడా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి.

తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ/జే సుచిత్, సిద్దార్థ్ కౌల్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా, సామ్ కరన్/డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

డ్రీమ్ 11 టీమ్:
వృద్ధిమాన్ సాహా, ఫాఫ్ డుప్లెసిస్, కేన్ విలియమ్సన్, జాసన్ రాయ్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, జాసన్ హోల్డర్, సిద్దార్థ్ కౌల్, శార్దూల్ ఠాకూర్, రషీద్ ఖాన్.


Click it and Unblock the Notifications












