SRH vs LSG: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస ఎదురదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇప్పటి ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ జట్టుకు ఊహించని మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం రేపుతోంది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరీ వెల్లడించారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు తెలిసింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ సమయంలో ట్రావిస్ హెడ్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
అయితే యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైంది. విదేశీ ఆటగాళ్లంతా తిరిగి ఇండియాకు వచ్చి మ్యాచ్‌లు ఆడుతున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి డేంజరస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మాత్రం రాలేదు. ట్రావిస్ హెడ్ కు ఆస్ట్రేలియాలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.

సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మ్యాచ్ జరగాల్సి ఉంది. కొవిడ్ బారిన పడటం వల్ల ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఐసోలేషన్ లో ఉంటున్నాడని.. ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదని డేనియల్ వెట్టొరీ తెలిపాడు. మిగిలిన మ్యాచ్ లలో ఆడతాడా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించాడు. కరోనా నుంచి ట్రావిస్ హెడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గొప్పగా ఏమీ రాణించలేదు. తొలి మ్యాచ్ అద్భుతంగా ఆడినప్పటికీ ఆ తర్వాత చతికిలపడింది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లను ఆడిన ఆరెంజ్ ఆర్మీ 3 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. 5 మ్యాచ్‌లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.