
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సన్‌రైజర్స్ జట్టు రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండు టీంలను కేన్ విలియమ్సన్ టీంగా, భువనేశ్వర్ కుమార్ టీంగా విడదీశారు. అంటే ఒక టీంకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించగా.. మరో టీంకు భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేసింది. అలాగే యూట్యూబ్‌లోనూ లైవ్ పెట్టింది.
ఈ మ్యాచ్‌లో మొదట కేన్ విలియమ్సన్ టీం బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు రాణించడంతో భువి టీం ముందు టఫ్ లక్ష్యం ఉంచింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. అంటే భువనేశ్వర్ టీం ముందు 147 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టుకు ఓపెనర్లు కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్ శుభారంభాన్ని అందించారు. సన్‌రైజర్స్ ట్విట్టర్ ఖాతా అప్‌డేట్ల ప్రకారం వీరిద్దరు 37 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి విలియమ్సన్ టీం 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఇక 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో త్రిపాఠి (24), వాషింగ్టన్ సుందర్ (26) ఉన్నారు. భువి టీం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేన్ మామ టీం చివరి 4 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి టీం
కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ప్రియమ్ గార్గ్, జె సుచిత్, శ్రేయాస్ గోపాల్, అభిషేక్ శర్మ, రొమారియో షెఫర్డ్, సీన్ అబ్బాట్, ఆర్ సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్‌హక్ ఫరూకీ