ఐపీఎల్-2024లో మరో సమరానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో వరుసగా రికార్డులు బద్దలుకొడుతున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్సీబీ మ్యాచ్‌లో ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలో మొదలైంది.
11 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న ఆర్సీబీ 262 స్కోరు రికార్డును ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది. ప్రత్యర్థి ప్లేయర్లపై కనికరం చూపకుండా విరుచుకుపడుతోంది. టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీపైనే 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. బలమైన ముంబై ఇండియన్స్‌ను (277 రన్స్) ఎస్‌ఆర్‌హెచ్ వదిలిపెట్టలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (266 పరుగులు) విధ్వంసం సృష్టించింది.

అదే జోరు కొనసాగిస్తూ మరోసారి ఆర్సీబీని చిత్తుచేయాలని కసితో ఉంది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలిచినప్పటికీ ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. 288 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన ఆర్సీబీ 262 రికార్డు ఛేజింగ్ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
తుదిజట్టు కూర్పుపై ప్రధాన దృష్టి పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేస్తే గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేయాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. కానీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి స్థానంలో జయదేవ్ ఉనద్కత్ లేదా ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేస్తే ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు.
SRH తుది జట్టు ఇదే (అంచనా)
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్