For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3 ఏళ్లకే అమ్మ దూరం.. నానమ్మే పెంచి క్రికెటర్‌ని చేసింది!

Aniket verma: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఆ జట్టుకు ఓ అద్భుతమై ఫినిషర్ దొరికాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు ఆర్సీబీని ఊచకోత కోసిన అనికేత్ వర్మ. చిన్నస్వామి స్టేడియంలో స్టార్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విఫలమైన సమయంలో 24 ఏళ్ల అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 238.89 స్ట్రైక్‌రేట్‌తో అనికేత్ వర్మ చేసిన విధ్వంసం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ మెరుపుల వెనుక ఓ కన్నీటి గాథ ఉంది.

అమ్మ లేదు.. నాన్న తోడు లేదు.. నానమ్మే సర్వస్వం!
సన్‌రైజర్స్ ఆటగాడు అనికేత్ వర్మ విజయం వెనుక ఉన్న పోరాటం ఎంతో బాధాకరమైనది. అనికేత్ వర్మకు కేవలం మూడేళ్ల వయస్సు ఉన్నప్పడే తన తల్లిని కోల్పోయాడు. తల్లిని వీడిన ఏడాదికే తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబం చెల్లాచెదురైంది. అటువంటి కష్ట సమయంలో నానమ్మ పార్వతీ వర్మ అనికేత్‌కు అండగా నిలిచాడు. అనికేత్ వర్మను వెంటబెట్టుకుని భోపాల్ వచ్చేసిన ఆమె.. కన్నతల్లి లేని లోటు తెలియకుండా అతడిని పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల నీడ లేకపోయినా.. నానమ్మ మార్గదర్శకత్వంలో అనికేత్ వర్మ నేడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

SRH Finisher Aniket Verma Emotional Story Lost Mother at 3 Raised by Grandmother to IPL Star

ఝాన్సీలో పుట్టి.. మధ్యప్రదేశ్‌లో క్రికెట్ ఓనమాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జన్మించిన అనికేత్ వర్మ.. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2025 ఐపీఎల్ వరకు అనికేత్ వర్మ మధ్యప్రదేశ్ తరఫున కేవలం ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు అనికేత్ ఒక్క ఫస్ట్-క్లాస్ లేదా లిస్ట్-ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ.. తన ప్రతిభతో టీ20 ఫార్మాట్లో స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అనికేత్ వర్మ ఖాతాలో 25 టీ20 మ్యాచ్‌లు, 164.81 స్ట్రైక్ రేట్‌తో 356 పరుగులు ఉన్నాయి.

ఎంపీఎల్ నుంచి ఐపీఎల్ వరకు..
అనికేత్ వర్మ తలరాతను మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 మార్చేసింది. భోపాల్ లెపార్డ్స్ తరపున ఆడుతూ కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లో 205 స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు బాదాడు. అనికేత్ వర్మ పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. ఐపీఎల్ 2025 వేలంలో అతడిని బేస్ ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. నేడు ఆ 30 లక్షల ఆటగాడు హైదరాబాద్ జట్టుకు కోట్లు విలువ చేసే మ్యాచ్ విన్నర్‌గా మారాడని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

వరుసగా రెండో ఏడాది అదే జోరు
అనికేత్‌ వర్మకు ఇది రెండో ఐపీఎల్ సీజన్. తన అరంగేట్ర సీజన్‌లోనే 12 ఇన్నింగ్స్‌ల్లో 166.19 స్ట్రైక్ రేట్‌తో 236 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లోనే అనికేత్ వర్మ ఆడిన తీరు చూస్తుంటే, హైదరాబాద్ జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో ఒక బలమైన ఆయుధం దొరికినట్లే కనిపిస్తోంది.

Story first published: Sunday, March 29, 2026, 11:30 [IST]
Other articles published on Mar 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+