ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థానీ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. చెన్నైకి చెందిన సన్ గ్రూప్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఈ జట్టును కూడా నడిపిస్తుండటంతో.. భారత్‌కు చెందిన యజమానులే పాక్ ఆటగాడిని ఎంపిక చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి స్పందిస్తూ.. అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడం తమ వ్యూహాత్మక నిర్ణయమని.. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదని స్పష్టం చేశారు.
ఈ వేలంలో అబ్రార్ అహ్మద్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు సన్‌రైజర్స్ జట్టు రూ.2.34 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని డేనియల్ వెట్టోరి.. "అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక డొమెస్టిక్ ప్లేయర్లు అబ్రార్ శైలిని అంత తేలికగా అంచనా వేయలేరు. వేలంలో మాకు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ.. అతడే మా మొదటి ప్రాధాన్యత" అని గట్టిగా చెప్పారు. అలాగే పాక్ ఆటగాళ్లను తీసుకోవద్దని తమకు ఎటువంటి ముందస్తు ఆదేశాలు లేవని వెట్టోరి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సంచలన నిర్ణయం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. సాధారణంగా ఇండియన్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తీసుకోవడానికి వెనుకాడతాయి. కానీ కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ఈ సాహసోపేతమైన అడుగు వేసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అబ్రార్ అహ్మద్‌తో పాటు మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు రూ.1.72 కోట్లకు అమ్ముడుపోగా.. హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లకు మాత్రం ఈ వేలంలో నిరాశే ఎదురైంది.