
ఆక్లాండ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు శుభవార్త. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ 2021 రెండో దశకు అందుబాటులో ఉండనున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇందుకు అనుమతిని కూడా ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌ఎచ్) కెప్టెన్ కేన్ విలియమ్సన్ నేరుగా యూఏఈ రానున్నాడు. దీంతో ఫాన్స్ ఆనందంలో తెలియాడుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఐపీఎల్ 2021 కోసం సిద్ధంగా ఉన్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. 'ఐ విల్ బి బ్యాక్' అంటూ వార్నర్ కామెంట్ చేశాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైన న్యూజిలాండ్ క్రికెటర్లలో దాదాపుగా అందరూ ఐపీఎల్ 2021 రెండో దశ ఆడనున్నారు. ఎందుకంటే యూఏఈలోనే ప్రపంచకప్ ముందు ఐపీఎల్ జరుగుతోంది. మెగా టోర్నీకి ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. ప్రపంచకప్ ముగిశాక కేన్ విలియమ్సన్ సారథ్యంలోని జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్లో.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో పర్యటించే ద్వితీయ శ్రేణి జట్టుకు టామ్ లేథమ్ నాయకత్వం వహిస్తాడు.
ఐపీఎల్ 2021 సమయంలో జరిగే ఉపఖండం పర్యటనకు రెండో శ్రేణి జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మరో జట్టును ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో పనిభారం పర్యవేక్షణ కోసం కివీస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం తెలిసింది. సీనియర్ ఆటగాడు రాస్ టేలర్‌ను పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీసుకు ఎంపిక చేశారు. టీమిండియాతో టెస్టు సిరీసుకు సన్నద్ధమయ్యేందుకు విశ్రాంతి తీసుకుంటానని అంగీకరించడంతో అతడి పేరు తొలగించారు. 18 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో న్యూజిలాండ్ జట్టు పర్యటిస్తుండటం గమనార్హం.
'న్యూజిలాండ్ జట్టు ఆగస్టు 23న బంగ్లాదేశ్‌కు బయల్దేరుతుంది. కోహ్లీసేనతో టెస్టులకు ఎంపికయ్యే సీనియర్లు సిరీస్ ముగియగానే స్వదేశానికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. జట్టు ఎంపిక చేసేందుకు మరి కొన్ని నెలలు పడుతుంది. ఈ బృందంలో 32 మంది ఆటగాళ్లు ఉన్నారు. వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల సంక్షేమం, భద్రత కోసం కొత్త వ్యూహాలు అమలు చేయాల్సి వస్తోంది. వారి పనిభారం నిర్వహణ కష్టమవుతోంది' అని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ అన్నారు. ఐపీఎల్‌పై తాము వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
టీ20 ప్రపంచకప్, టీమిండియాతో టీ20 జట్టు:
కేన్ విలియమ్సన్, టాడ్ ఆస్ట్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నీ.