యువ ప్లేయర్ అభిషేక్ శర్మపై దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. త్వరలో అభిషేక్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అన్నాడు. అంతేగాక భవిష్యత్‌లో ఆ భారత కుర్రాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయాల్లో అభిషేక్ శర్మ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ ఎస్‌ఆర్‌హెచ్‌కు మెరుపు ఆరంభాల్ని అందిస్తున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 36 సగటు, 205 స్ట్రైక్‌రేటుతో 405 పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ (35) రికార్డు నెలకొల్పాడు.

ఈ నేపథ్యంలో అభిషేక్‌ను కొనియాడుతూ మార్క్‌రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''గత సీజన్లలో అభిషేక్ శర్మ సానుకూల సంకేతాలు చూపించాడు. కానీ ఈ సీజన్‌లో అతడు భారీ విజయాలు సాధించాడు. నిలకడగా సత్తాచాటుతూ మంచి స్థితిలో కొనసాగుతున్నాడు. ఓ రోజు భారత్ తరఫున అతను కచ్చితంగా అరంగేట్రం చేస్తాడని ఆశిస్తున్నా. అతనుక్ ఎంతో ప్రశాంతతో ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సత్తాచాటుతున్నాడు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు'' అని మార్క్‌రమ్ అన్నాడు.
కాగా, ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. 12 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఏడింట్లో గెలిచి 14 పాయింట్లు సాధించింది. రేపటి మ్యాచ్‌లో గుజరాత్‌పై నెగ్గితే 16 పాయింట్లకు చేరుకుంటుంది.
ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (19), రాజస్థాన్ రాయల్స్ (16) మినహా మరే జట్టు 16 పాయింట్లను అందుకోలేదు. అందుకే గుజరాత్‌పై గెలిస్తే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ తదుపరి దశకు సునాయాసంగా చేరుకుంటుంది. అయితే రేపటి మ్యాచ్‌లో మార్క్‌రమ్‌ను తిరిగి తుదిజట్టులో చేర్చాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.