తిరువనంతపురం: క్రికెట్ నుంచి జీవితం కాలం నిషేధానికి గురైన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. సినిమాల్లో నటించడం, నాట్యం చేయడం, పాటలు రాయడం వంటి పనులను చేపట్టడానికి శ్రీశాంత్ సిద్ధపడ్డాడు. ఆయన సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నాడు.
తన సోదరుడు తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రానికి శ్రీశాంత్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. తన బావ మధు బాలకృష్ణన్ నిర్మిస్తున్న అంబుల్లా అజాగే చిత్రంలో అతను చిన్న పాత్ర పోషిస్తున్నాడు. దానికి తోడు ఓ పాట కూడా పాడుతున్నాడు.

చిత్రంలోని అన్ని పాటలకు శ్రీశాంత్ సంగీతం సమకూరుస్తున్నాడని, తమ సినిమా సస్పెన్స్, డ్రామాలతో కూడిన ప్రేమకథ అని, ప్రధాన పాత్రల నిర్ణయం ఇంకా జరగలేదని శ్రీశాంత్ అన్నయ్య, చిత్ర నిర్మాత దీపు సంతన్ చెప్పారు.
శ్రీశాంత్ నృత్య ప్రధానమైన ఝలక్ దిక్లా జా అనే టీవీ షో తదుపతి సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ప్రారంభమవుతుంది. ఈ కలర్స్ టీవీ షో చిత్ర నిర్మాణానికి ఆటంకం కాబోదని శంతన్ చెప్పారు. 2011 ప్రపంచ కప్ పోటీల సందర్భంగా శ్రీశాంత్ రెండు మ్యాజిక్ ఆల్బమ్స్‌ను రూపొందించి, దర్శకత్వం వహించారు.