నా భర్త జీవితం నాశనమైంది: బీసీసీఐకి క్రికెటర్ శ్రీశాంత్ భార్య లేఖ

హైదరాబాద్: తన భర్తకు న్యాయం చేయాలంటూ స్పాట్ ఫిక్సింగ్ ఘటనలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న టీమిండియా పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి బీసీసీఐకి లేఖ రాసింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అయితే తన భర్తపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని భువనేశ్వరి బీసీసీఐకి రాసిన ఓపెన్ లెటర్‌లో పేర్కొంది. తప్పుడు ఆరోపణల కారణంగా తన భర్త జీవితం నాశనమైందని ఆమె అందులో పేర్కొంది. 2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై ఉన్న స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టేసినప్పటికీ, బోర్డు మాత్రం నిషేధం ఎత్తేయడానికి అంగీకరించలేదు.
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఛీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అసలేం జరిగింది?
2013 ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

స్థానిక టోర్నీల్లో ఆడేందుకు
దీంతో ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినప్పటికీ, బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేరళ హైకోర్టులో అతడికి ఊరట లభించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బీసీసీఐ సవాల్ చేసింది.

శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు
ఇందులో భాగంగా కేరళ హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అందుకే తాము నిషేధం విధించామని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. స్ఫాట్ ఫిక్సింగ్ వ్యవహారం భారత క్రికెట్‌ని కుదిపేసిందని.. అలాంటి నేరానికి పాల్పడిన క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేయాలనుకోవడం సమంజసం కాదంటూ వాదనలు వినిపించింది.
ఫిక్సింగ్ ఆరోపణలపై కంటతడి పెట్టుకున్న శ్రీశాంత్
దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు చేసేదేమీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శ్రీశాంత్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదే షోలో తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందిస్తూ శ్రీశాంత్ కంటతడి పెట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications