కొచ్చి: ఐపియల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జీవిత కాల నిషేధానికి గురైన భారత మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. జైపూర్‌కు చెందిన ఓ రాచకుటుంబం అమ్మాయితో ఆయనకు పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. డిసెంబర్‌లో ఈ వివాహం జరుగుతుంది.
కేరళలోని గురువయ్యూర్ దేవాలయంలో డిసెంబర్ 12వ తేదీన శ్రీశాంత్ వివాహం చేసుకోబోతున్నాడు. శ్రీశాంత్‌ను వివాహం చేసుకుంటున్న జైపూర్‌కు చెందిన యువతి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆ అమ్మాయిని శ్రీశాంత్ 2006లో జైపూర్‌లో మ్యాచ్ అడినప్పుడు కలిసి, ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు సమాచారం.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో జైలుకు వెళ్లినప్పుడు శ్రీశాంత్‌తో ఆమె సంబంధాలు కొనసాగిస్తూ కేసు పరిష్కారంలో న్యాయవాదుల బృందంతో కలిసి పనిచేసినట్లు చెబుతున్నారు. ఆమె కుటుంబం కూడా శ్రీశాంత్‌కు మద్దతుగా నిలిచింది.
ఆ అమ్మాయి తండ్రి జైలులో శ్రీశాంత్‌ను కలిసినట్లు ది హిందూ పత్రిక రాసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీశాంత్ ఆ అమ్మాయిని తరుచుగా కలుసుకున్నట్లు సమాచారం.